Telugu Global
Telangana

ప్రేమ పరిష్కారం కోసం గూగుల్ లో వెతికి మోసపోయిన వైద్యురాలు

తాను సొంతంగా ఒక క్లినిక్ పెట్టాలనుకుంటున్నానని వ్యాపారం సజావుగా సాగేందుకు ప్రార్థనలు చేయాలంటూ నైజీరియన్ బ్యాచ్ కు 12 లక్షల 45 వేల రూపాయలు పంపించింది.

ప్రేమ పరిష్కారం కోసం గూగుల్ లో వెతికి మోసపోయిన వైద్యురాలు
X

చాలామంది అనుకుంటారు. అజ్ఞానం, అమాయకత్వం చదువుకోని వాళ్ల దగ్గర ఎక్కువగా ఉంటుందని. కానీ, అది పూర్తిగా నిజం కాదు. చదువురాని వాళ్ళు తాము ఎక్కడ మోసపోతామో ఆని చాలా జాగ్రత్తగా బతుకుతూ ఉంటారు. బాగా ఉన్నత చదువులు చదివిన వాళ్లు కూడా ఒకసారి ఈజీగా మోసగాళ్ల చేతిలో బోల్తా పడుతుంటారు. హైదరాబాద్ కుషాయిగూడకు చెందిన ఒక కంటి వైద్యురాలు ఇలాగే నైజీరియన్ బ్యాచ్ చేతిలో మోసపోయింది.

నైజీరియా కు చెందిన ఉజాల, మైకేల్ అజుండా, ఒక్వుచుక్వు, డేనియల్ లు బట్టల వ్యాపారం చేసి బాగుపడదామని ఢిల్లీ వచ్చారు. తీరా వ్యాపారంలో భారీగా నష్టపోయారు. ఇలా అయ్యే పని కాదని మోసాలకు సిద్ధపడ్డారు. ప్రేమ సమస్యలు ఉన్న, వ్యాపార సమస్యలు ఉన్న, కుటుంబ సమస్యలు ఉన్న తాము పరిష్కరిస్తామంటూ ఆన్‌లైన్‌లో ఫోన్ నంబర్లు ఉంచారు.

హైదరాబాద్ కుషాయిగూడ కు చెందిన ఒక కంటి వైద్యురాలు ప్రేమ విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. గూగుల్ లో జ్యోతిష్యుల కోసం ఆ వైద్యురాలు అన్వేషించగా.. ఈ నైజీరియన్ బ్యాచ్ నంబర్ కంటపడింది. దాంతో వైద్యురాలు వారికి ఫోన్ చేసింది. మీ సమస్య చాలా చిన్నది తాము ప్రార్థనలు, పూజలు చేసి పరిష్కరిస్తామంటూ తొలుత లక్ష రూపాయలు తీసుకున్నారు. అయితే యాదృచ్చికంగా తన ప్రియుడు తనకు దగ్గర కావడంతో ఈ నైజీరియన్ బ్యాచ్ పై కంటి వైద్యురాలు మరింత నమ్మకాన్ని పెంచుకుంది.

తాను సొంతంగా ఒక క్లినిక్ పెట్టాలనుకుంటున్నానని వ్యాపారం సజావుగా సాగేందుకు ప్రార్థనలు చేయాలంటూ నైజీరియన్ బ్యాచ్ కు 12 లక్షల 45 వేల రూపాయలు పంపించింది. కానీ, కంటి వైద్యురాలి క్లినిక్ ఏర్పాటు పనులు మాత్రం సజావుగా సాగలేదు. దాంతో నైజీరియన్ ఫేక్ జ్యోతిష్యుల్ని ఆమె సంప్రదించగా మరింత డబ్బు కావాలంటూ బెదిరింపుతో మాట్లాడారు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన కంటి వైద్యురాలు రాచకొండ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఢిల్లీ వెళ్లి నైజీరియన్ బ్యాచ్ లోని ఇద్దరు వ్యక్తుల్ని అరెస్టు చేశారు. మిగిలిన నిందితులు పోలీసులకు చిక్కకుండా పారిపోయారు.

First Published:  12 Jan 2023 4:16 AM GMT
Next Story