Telugu Global
Telangana

సికిందరాబాద్ లో పేలుడు... ఇల్లు ధ్వంసం, దంపతులకు తీవ్ర గాయాలు

సికిందరాబాద్ లో ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఇల్లు ధ్వంసం కాగా, ఆ ఇంట్లో నివసిస్తున్న దంపతులు తీవ్ర గాయాలపాలయ్యారు. పేలుడుకు కారణాలు ఇప్పటి వరకు తెలియలేదు.

సికిందరాబాద్ లో పేలుడు... ఇల్లు ధ్వంసం, దంపతులకు తీవ్ర గాయాలు
X

సికిందరాబాద్, రాంగోపాల్ పేటలో ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసం కాగా ఆ ఇంట్లో ఉన్న భార్యాభర్తలిద్దరూ తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఓ అపార్ట్ మెంటులో మొదటి అంతస్తులో ఉన్న ఈ ఇంట్లో జరిగిన పేలుడు శబ్ధానికి చుట్టు పక్కల జనం పరుగులు తీశారు.

విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న‌ పోలీసులు గాయాలపాలైన దంపతులిద్దరినీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

కాగా పేలుడు ఎలా జరి‍గిందనే విషయం ఇప్పటికీ తేల లేదు. ముందుగా గ్యాస్ సిలండర్ పేలిందనుకున్నారు కానీ వంటింట్లో ఉన్న సిలండర్ పేలలేదని పోలీసులు కనుగొన్నారు. సిలండర్ లీకయినట్టు కూడా ఎటువంటి ఆనవాలు లేదని పోలీసులు చెప్తున్నారు. ఇంట్లో పేలుడు పదార్థాలు కూడా లేవని పోలీసులు అంటున్నారు.

Advertisement

మరో వైపు క్లూస్ టీం రంగంలోకి దిగింది. పేలుడు ఎలా జరిగిందనే విషయంపై పరిశోధన చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే తప్ప ఏ విషయం చెప్పలేమని పోలీసులు ప్రకటించారు. గాయాలపాలైన దంపతులు స్పృహలోకి వస్తే కొంత సమాచారం తెలియవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

గాయపడ్డ దంపతులను సందీప్, అనులుగా గుర్తించారు. వీరిద్దరు నేపాల్ కు చెందిన వారు. 20 రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చిన వీళ్ళు ఒక వస్త్ర దుఖానంలో పనిచేస్తున్నారు.

Next Story