Telugu Global
Telangana

ఉత్కంఠ రేపుతున్న అలంపూర్‌, నర్సాపూర్‌... BRS బీఫామ్‌ ఎవరికి..?

బీఆర్ఎస్‌లో ఆసక్తి రేపుతున్న మరోస్థానం ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌. కేసీఆర్‌ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. నర్సాపూర్ స్థానాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టారు.

ఉత్కంఠ రేపుతున్న అలంపూర్‌, నర్సాపూర్‌... BRS బీఫామ్‌ ఎవరికి..?
X

తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే 115కు పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి దూకుడు మీద ఉంది. 100 మందికిపైగా అభ్యర్థులకు సీఎం కేసీఆర్ బీఫామ్‌లు సైతం అందించారు. అయితే రెండు నియోజకవర్గాలు మాత్రం ఇప్పటికీ బీఆర్ఎస్‌లో ఉత్కంఠ రేపుతున్నాయి. అవే ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌, పాలమూరు జిల్లాలోని అలంపూర్‌.

అలంపూర్‌లో సిట్టింగ్‌ ఎమ్మెల్యే అబ్రహంకు టికెట్‌ కన్ఫామ్ చేసినప్పటికీ.. ఆయనకు బీ ఫామ్‌ ఇస్తారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. బీఫామ్‌ చేతికిస్తారన్న టైంలో అలంపూర్‌ బీఆర్ఎస్‌లో అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే అబ్రహంకు మళ్లీ టికెట్ ఇవ్వడాన్ని పార్టీలోని కొందరు బలంగా వ్యతిరేకిస్తున్నారు. అబ్రహంను మార్చాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా అలంపూర్‌ బీఆర్ఎస్‌.. ఎమ్మెల్యే అబ్రహం, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గాలుగా చీలడంతో కేడర్‌ గందరగోళంలో పడింది. దీంతో పార్టీ అదిష్టానం సైతం పునరాలోచనలో చేస్తోంది. ఇప్పుడు అలంపూర్‌ బీ ఫామ్‌ ఎవరికి ఇస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఇక బీఆర్ఎస్‌లో ఆసక్తి రేపుతున్న మరోస్థానం ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌. కేసీఆర్‌ 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినప్పటికీ.. నర్సాపూర్ స్థానాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టారు. నాలుగు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామన్న కేసీఆర్‌.. నెల రోజులు దాటినప్పటికీ అభ్యర్థిని ఫైనల్ చేయలేకపోయారు. ఇక్కడ ప్రస్తుతం చిలుముల మదన్‌ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈ స్థానాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న సునీతాలక్ష్మారెడ్డికి ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది. మదన్‌ రెడ్డి మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. మంత్రి హరీష్‌ రావు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. మదన్‌ రెడ్డి వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత పార్టీ చీఫ్‌, సీఎం కేసీఆర్ స్వయంగా మదన్‌ రెడ్డిని ప్రగతిభవన్‌కు పిలుచుకుని మాట్లాడి నచ్చజెప్పినట్లు సమాచారం. దీంతో సునీతా లక్ష్మారెడ్డికి లైన్ క్లియర్ అయిందని అంతా భావించారు. ఇప్పటివరకూ 100 మందికి పైగా అభ్యర్థులకు బీ-ఫామ్‌ ఇచ్చిన కేసీఆర్‌.. సునీతా రెడ్డికి మాత్రం ఇవ్వలేదు. మదన్‌ రెడ్డి మనస్ఫూర్తిగా అంగీకరించి క్షేత్రస్థాయిలో పని చేస్తేనే నర్సాపూర్‌లో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీంతో మదన్‌రెడ్డిని ఒప్పించిన తర్వాతే సునీతా లక్ష్మారెడ్డికి బీఫామ్‌ ఇవ్వనున్నట్లు సమాచారం.

First Published:  21 Oct 2023 3:48 PM GMT
Next Story