Telugu Global
Telangana

అదే జోరు, అదే హుషారు.. బయటకొచ్చిన పాత మల్లారెడ్డి

మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు మల్లారెడ్డి. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు తెలిపారు.

అదే జోరు, అదే హుషారు.. బయటకొచ్చిన పాత మల్లారెడ్డి
X

పూలమ్మిన, పాలమ్మిన అంటూ నవ్వులు పంచడమే కాదు, మైక్ అందుకుంటే సభలో ఉన్నవారందర్నీ హుషారెత్తించడంలో మాజీ మంత్రి మల్లారెడ్డి దిట్ట. అయితే ఆ మెరుపులు కొన్నిరోజులుగా మసకబారాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆయనలో హుషారు కాస్త తగ్గింది. అందులోనూ ఆయన విద్యాసంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేయడంతో మల్లారెడ్డి డల్ అయ్యారు. ఓ దశలో ఆయన కాంగ్రెస్ లో చేరిపోతున్నారనే ప్రచారం జరిగింది. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ కావడం విశేషమే అయినా ఆ తర్వాత సంచలనాలేవీ జరగలేదు. కొడుక్కి బీఆర్ఎస్ ఎంపీ టికెట్ కూడా వద్దనుకున్న మల్లారెడ్డి.. కొన్నాళ్లు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటం కష్టమేనని అకున్నారంతా. కానీ ఆ పాత మల్లారెడ్డి తిరిగొచ్చారు. మల్కాజ్ గిరి పార్లమెంటరీ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతల మీటింగ్ లో హుషారుగా మాట్లాడారాయన.


కేటీఆర్ లాంటి నాయకులు ప్రపంచంలోనే లేరని అన్నారు మల్లారెడ్డి. ఆయన వల్లే ఇప్పుడు హైదరాబాద్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోందని, కానీ కాంగ్రెస్ వచ్చాక అభివృద్ధి పడకేసిందని చెప్పారు. హైదరాబాద్ లో ఏ ఫ్లైఓవర్ చూసినా కేటీఆర్ గుర్తొస్తారని చెప్పారు. కేబుల్ బ్రిడ్జ్ లు కట్టి, ఐటీ కంపెనీలు తెచ్చి.. తెలంగాణ రూపు రేఖలు మార్చేశారని చెప్పారు. మల్కాజ్ గిరిలో కాంగ్రెస్, బీజేపీకి ఓటు బ్యాంకు లేదని, ఈసారి కచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగురుతుందన్నారు మల్లారెడ్డి.

కాంగ్రెస్, బీజేపీకి ఓటు అడిగే హక్కు కూడా లేదన్నారు మల్లారెడ్డి. తెలంగాణకు ఆ రెండు పార్టీలు చేసిందేమీ లేదని అన్నారు. దేశ ప్రజలను జాతీయ పార్టీలు మోసం చేశాయని ఆరోపించారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు తెలిపారు. మల్లారెడ్డి హుషారుగా మాట్లాడి, కార్యకర్తల్లో కూడా హుషారు నింపారు. ఆయన రాకతో మల్కాజ్ గిరి మీటింగ్ సందడిగా సాగింది.

First Published:  27 March 2024 8:49 AM GMT
Next Story