Telugu Global
Telangana

ప్రియాంక గాంధీ వచ్చినా.. నిరుత్సాహంలోనే కాంగ్రెస్ శ్రేణులు!

ప్రియాంక గాంధీ సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన సభలో కనీసం గంట సేపు కూడా కేటాయించలేదని పార్టీ శ్రేణులే విమర్శిస్తున్నాయి.

ప్రియాంక గాంధీ వచ్చినా.. నిరుత్సాహంలోనే కాంగ్రెస్ శ్రేణులు!
X

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్లు, రేవంత్ రెడ్డి వర్గం మధ్య ఉన్న విభేదాలతో ఇప్పటికే కార్యకర్తలు డీలా పడిపోయారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడం మాట పక్కన పెడితే.. కనీసం పార్టీని కూడా గాడిలో పెట్టలేకపోతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై విమర్శలు వస్తున్నాయి. రేవంత్, భట్టి విక్రమార్క పాదయాత్రలు చేస్తున్నా.. ప్రజల్లో అనుకున్నంత స్పందన రావడం లేదు. దీంతో ప్రియాంక గాంధీ సభతో అయినా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని రాష్ట్ర కాంగ్రెస్ భావించింది. సభను అంతా తానై నడిపించిన రేవంత్ రెడ్డి.. సీనియర్లకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. పైగా, సభ మొత్తం చప్పగా సాగడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహంలో మునిగిపోయాయి.

ప్రియాంక గాంధీ సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన సభలో కనీసం గంట సేపు కూడా కేటాయించలేదని పార్టీ శ్రేణులే విమర్శిస్తున్నాయి. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినట్లే ఉందని.. కనీసం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం తెచ్చేలా మాట్లాడలేక పోయారనే చర్చ జరుగుతున్నది. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ.. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో యూత్ డిక్లరేషన్ పేరుతో చదివి వినిపించారు. అయితే వాటిపై కాంగ్రెస్ శ్రేణులు కూడా పెదవి విరుస్తున్నాయి.

మరోవైపు సాక్షాత్తూ సోనియా కుమార్తె, రాహుల్ గాంధీ సోదరి హైదరాబాద్ వచ్చి సభలో పాల్గొంటే.. సీనియర్లు మాత్రం డుమ్మా కొట్టారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ లాంటి లీడర్లు సభకు రాకపోవడం కాంగ్రెస్ కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది. రేవంత్ రెడ్డితో సీనియర్లకు పొసగడం లేదనే వార్తలకు సోమవారం నాటి సభ బలం చేకూర్చింది.

ఇక సభకు వచ్చిన సీనియర్లకు రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై కూడా చర్చ జరుగుతోంది. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి ఉత్త బొమ్మల్లా స్టేజీపై కూర్చున్నారు. ఇక ప్రియాంక్ స్టేజీపై ఉన్నప్పుడు భట్టి, రేవంత్ మాత్రమే మాట్లాడారు. ప్రియాంక ఇక్కడకు వచ్చినా పెద్దగా ఇంపాక్ట్ లేదని.. యువతను ఆకట్టుకునేలా మాట్లాడలేకపోయారని అంటున్నారు. ఏదో హడావిడి ప్రోగ్రామ్‌లాగా జరిపారు తప్ప.. కాంగ్రెస్‌కు ఎలాంటి ప్లస్ కాలేదని చెబుతున్నారు. వరంగల్‌లో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ చేసినప్పుడు వచ్చిన మైలేజీతో పోల్చుకుంటే ప్రియాంక సభ చాలా చప్పగా ఉందని.. ఇది ఏ మాత్రం కాంగ్రెస్ కార్యకర్తలకు ఉత్సాహం ఇవ్వలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.

First Published:  9 May 2023 2:45 AM GMT
Next Story