Telugu Global
Telangana

రూ.426 కోట్ల రుణం ఎగవేత.. సుజనా చౌదరి ఆస్తులు జప్తు

సుజనా చౌదరి యూకో బ్యాంకుకు చెల్లించాల్సిన రూ.426,55,69,662ను ఎగవేశారు.

రూ.426 కోట్ల రుణం ఎగవేత.. సుజనా చౌదరి ఆస్తులు జప్తు
X

రుణాల ఎగవేతలో తన రికార్డులను తానే బ్రేక్ చేస్తుంటారు బీజేపీ నాయకుడు సుజనా చౌదరి. కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన యలమంచిలి సత్యానాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి మొదట్లో టీడీపీలో ఉండేవారు. కేంద్రంలో మంత్రిగా కూడా పని చేశారు. అదే సమయంలో సుజనా గ్రూప్ పేరుతో వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు కుచ్చు టోపీ వేశారు. ఐదేళ్ల క్రితమే డొల్ల కంపెనీల సహాయంతో బ్యాంకులకు రూ.5,700 కోట్ల మేర సుజనా చౌదరి మోసగించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. 2018లో సుజనాపై ఈడీతో పాటు సీబీఐ కేసు నమోదు చేయగా.. 2019లో ఆయన బీజేపీలో చేరడం గమనార్హం.

తాజాగా సుజనా చౌదరి యూకో బ్యాంకుకు చెల్లించాల్సిన రూ.426,55,69,662ను ఎగవేశారు. మేడ్చెల్ జిల్లా పరిధిలో ఉన్న భూములను తాకట్టు పెట్టి చాలా ఏళ్ల క్రితమే సుజనా చౌదరి రూ.420 కోట్ల వరకు రుణం తీసుకున్నారు. మేడ్చెల్ జిల్లాలో ఇండస్ క్రియేటర్స్, ఇండస్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన భూములను యూకో బ్యాంకులో సుజన మెటల్ ప్రొడక్ట్స్, వై సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) రుణం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. పలుమార్లు ఈ రుణాన్ని తిరిగి చెల్లించాలని బ్యాంకు అధికారులు నోటీసులు పంపినా సుజనా చౌదరి స్పందించలేదు.

దీంతో సుజనా చౌదరికి ఇచ్చిన రుణాన్ని నిరర్దక ఆస్తి కింద జమకట్టి.. అతను తాకట్టు పెట్టిన భూములను బ్యాంకు జప్తు చేసుకున్నది. ఈ మేరకు బ్యాంకు పలు పత్రికల్లో నోటీసులు కూడా జారీ చేసింది. ఈ ఏడాది జూలై 31 నాటికి అసలు, వడ్డీ కలుపుకొని సుజనా చౌదరి రూ.426,55,69,662 చెల్లించాల్సి ఉందని.. అయితే దీన్ని 2014 డిసెంబర్ 31నే నిరర్దక ఆస్తిగా పేర్కొన్నామని అధికారులు తెలిపారు. గతంలో నోటీసులు పంపినా అవి డెలివరీ కాకుండా తిరిగి వచ్చాయని.. అందుకే పత్రికల్లో బహిరంగ ప్రకటన ఇస్తున్నట్లు పేర్కొన్నాయి.

సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్‌స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంటరెస్ట్ యాక్ట్ 2002 ప్రకారం ప్రకటన జారీ చేసిన 60 రోజుల్లోగా చెల్లించడంలో విఫలమయ్యారని బ్యాంకు తెలిపింది. ఈ రుణాన్ని పొందిన వ్యక్తులు, హామీదారులు, న్యాయ వారసులకు ఇదే తుది నోటీసుగా బ్యాంకు పేర్కొన్నది. ఆ మేరకు తనఖా పెట్టిన ఆస్తులను జప్తు చేసుకోవడానికి అధికారం ఉంటుందని బ్యాంకు తెలిపింది.


First Published:  19 Oct 2023 2:25 PM GMT
Next Story