Telugu Global
Telangana

బీజేపీలో ఈటల వర్సెస్ సీనియర్లు

జాతీయ నేతలు రాష్ట్రానికి వచ్చినా తమను కలవడం లేదని.. అమిత్ షా సభలోనూ అవమానం జరిగిందని కొందరు బహిరంగంగానే చెప్పుకొచ్చారు.

బీజేపీలో ఈటల వర్సెస్ సీనియర్లు
X

బీజేపీ ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఒంటరైపోయారా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఈటలపై రాష్ట్ర పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కిషన్‌ రెడ్డి అధ్యక్షుడయ్యాక పార్టీలోని కొంతమంది సీనియర్లకు, ఈటలకు గ్యాప్ పెరిగినట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడాన్ని పలువురు సీనియర్లు తప్పుపడుతున్నారు. బీఆర్ఎస్‌ నుంచి బయటకొచ్చిన ఈటలను తామే పార్టీలోకి తీసుకువచ్చామని.. అలాంటిది ఇప్పుడు తమనే నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. జాతీయ నేతలు రాష్ట్రానికి వచ్చినా తమను కలవడం లేదని.. అమిత్ షా సభలోనూ అవమానం జరిగిందని కొందరు బహిరంగంగానే చెప్పుకొచ్చారు. బండి సంజయ్‌ పార్టీ చీఫ్‌గా ఉన్న టైంలో ఢిల్లీకి వెళ్లి ఈటల లీకులిచ్చారని ఆరోపిస్తున్నారు. చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఈటల ఎవరిని పార్టీలోకి తీసుకువచ్చింది కూడా లేదంటున్నారు.

ఇటీవల బీజేపీ అధిష్టానం తీరుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ లీడర్ విజయశాంతి నివాసంలో కొందరు అసంతృప్త నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ నేతలు గత వారం రోజుల్లో నాలుగైదు సార్లు సమావేశమవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ నేతలు ఈటల రాజేందర్ వైఖరితో పాటు పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న విధానంపై చర్చించినట్లు సమాచారం. పార్టీ తీరు మారకుంటే మూకుమ్మడిగా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

కేసీఆర్‌పై పార్టీ వైఖరెంటో తేల్చాలని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు అసంతృప్త నేతలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సిసోడియాను అరెస్టు చేసినప్పటికీ.. కవితను మాత్రం అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ అధిష్టానం రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కోరుకుంటుందా.. లేదా..? కేసీఆర్‌పై వైఖరేంటో తేల్చాలని బీజేపీ అసమ్మతి నేతలు డిమాండ్ చేస్తున్నారు.

First Published:  28 Sep 2023 3:28 AM GMT
Next Story