Telugu Global
Telangana

వాట్సప్ మెసేజ్ నేను ఓపెన్ చేయలేదు.. ఈటల కవరింగ్ కష్టాలు

ఈటల వ్యవహారంలో విచారణ స్పీడందుకుంది. విచారణకు హాజరైన ఈటల.. తన సెల్ ఫోన్ ని పోలీసులకు అప్పగించారు. వారడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

వాట్సప్ మెసేజ్ నేను ఓపెన్ చేయలేదు.. ఈటల కవరింగ్ కష్టాలు
X

తెలంగాణలో టెన్త్ హిందీ పేపర్ లీక్ అయిన రోజు బండి సంజయ్, ఈటల రాజేందర్ సెల్ ఫోన్లకు ఓ కాపీ వాట్సప్ లో వచ్చిందనేది ప్రధాన ఆరోపణ. దాన్ని నిరూపించేందుకు అవకాశం లేకుండా చేయాలనే ఉద్దేశంతో బండి సంజయ్ తన ఫోన్ పోయిందని చెప్పేశారు, పైగా పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చారు. ఇటు ఈటల రాజేందర్ మాత్రం పోలీసులు చెప్పిన నెంబర్ నుంచి తనకెలాంటి మెసేజ్ రాలేదని, మరో ఫోన్ నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్ ని తాను అసలు ఓపెన్ చేయలేదని అంటున్నారు. ఈమేరకు వంరగల్ సెంట్రల్ డీసీపీ ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు.

టెన్త్ హిందీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఈటల రాజేందర్‌ ను ఈరోజు వరంగల్ పోలీసులు విచారించారు. పరీక్ష ప్రారంభమైన గంట తర్వాత ప్రశాంత్ అనే వ్యక్తి ఈటలకు వాట్సప్ ద్వారా టెన్త్ పేపర్ పంపించాడని పోలీసులు అంటున్నారు. ఆయన్ను కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఏ-1 గా ఉన్న బండి సంజయ్ ని పోలీసులు ఆల్రడీ అరెస్ట్ చేయడం, జైలుకి పంపడం, ఆయన బెయిల్ పై బయటకు రావడం తెలిసిందే. ఇప్పుడు ఈటల వ్యవహారంలో విచారణ స్పీడందుకుంది. విచారణకు హాజరైన ఈటల.. తన సెల్ ఫోన్ ని పోలీసులకు అప్పగించారు. వారడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ కేసులో ఈటల రాజేందర్ పీఏలను పోలీసులు విచారించి వారి సెల్‌ ఫోన్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే.

పోలీసుల నోటీసులో పేర్కొన్న ఫోన్ నంబర్ నుంచి తనకు ఎలాంటి వాట్సప్ మెసేజ్ రాలేదంటున్నారు ఈటల. వేరే నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ ని తాను ఓపెన్ చేసి చూడలేదని పోలీసులకు వివరణ ఇచ్చారు. తమ పార్టీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ ని కోరుకుంటుందని, తాను అలాంటి పనులు చేయనని చెప్పారు. 9.30 కి పరీక్ష మొదలయితే 11 గంటల తరువాత పేపర్ బయటికి వస్తే దానిని పేపర్ లీక్ ఎలా అంటారని ప్రశ్నించారు. తమని కుట్రపూరితంగా టెన్త్ పేపర్ లీకేజ్ కేసులో ఇరికించారని ఆరోపించారు ఈటల.

First Published:  10 April 2023 10:16 AM GMT
Next Story