Telugu Global
Telangana

రేవంత్ రెడ్డి ధీరుడనుకున్నా కానీ ఇలా ఏడుస్తాడనుకోలేదు...ఈటల రాజేందర్

రేవంత్ ఒకవైపు ఏడుస్తూనే మరో వైపు సంస్కారహీనంగా మాట్లాడారని ఈటల మండిపడ్డారు. తాను జైలుకు పోయానంటూ చెప్తున్న రేవంత్ రెడ్డి ఎందుకు జైలుకు పోయాడో కూడా చెప్పాలని సవాల్ విసిరాడు ఈటల.

రేవంత్ రెడ్డి ధీరుడనుకున్నా కానీ ఇలా ఏడుస్తాడనుకోలేదు...ఈటల రాజేందర్
X

పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ల మధ్య రసవత్తర వివాదం కొనసాగుతూనే ఉంది. నిన్నంతా దేవాలయంలో రేవంత్ రెడ్డి ప్రమాణాలు, ఏడుపులు కొనసాగగా ఈ రోజు ఈటల విమర్శలు, ఆరోపణలు సాగాయి.

బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డిపై విరుచుకపడ్డారు. తెలంగాణ ప్రజల సమస్యలపై రేవంత్ రెడ్డి ధీరుడిలా పోరాడుతాడనుకున్నా కానీ ఆయన ఇలా ఏడుస్తాడ‌నుకోలేదు అన్నారు. వీరుడు కొట్లాడుతాడు తప్ప ఏడవడని ఆయన వ్యాఖ్యానించారు.

రేవంత్ ఒకవైపు ఏడుస్తూనే మరో వైపు సంస్కారహీనంగా మాట్లాడారని ఈటల మండిపడ్డారు. తాను జైలుకు పోయానంటూ చెప్తున్న రేవంత్ రెడ్డి ఎందుకు జైలుకు పోయాడో కూడా చెప్పాలని సవాల్ విసిరాడు ఈటల. రేవంత్ ప్రజల కోసం జైలుకు వెళ్ళలేదని, ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్ళాడని ఈటల అన్నారు.

తాను విద్యార్థి దశలోనే ఉద్యమాలు చేశానని , ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటి పాలక కమిటికీ వ్యతిరేకంగా ఉద్యమిస్తే.. తనతో పాటు మరికొందరిని రెండుసార్లు జైలులో పెట్టారని వివరించారు.

''తెలంగాణ ఉద్యమంలో నిత్యం రోడ్లమీద మేం కొట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారు ? తెలుగుదేశం అధినేత చంద్రబాబు పంచన చేరి, ఉద్యమానికి దూరంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కరీంనగర్ లో నిర్వహించతలపెట్టిన సభలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి వస్తున్నారనే విషయం తెలిసి అడ్డుకుంటామని ఉద్యమకారులు హెచ్చరిస్తే, రేవంత్ రెడ్డి తన తుపాకీ చేతిలో పట్టుకుని ఎవడు వస్తాడో రమ్మని సవాల్ చేసిన విషయం నాకు ఇంకా గుర్తుంది. తెలంగాణ ఉద్యమంలో భాగంగా నాపై వందల కేసులు నమోదయ్యాయి, మహబూబ్ నగర్, కరీంనగర్ జైళ్లలో శిక్ష అనుభవించాను.'' అని ఈటల రాజేందర్ తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండూ కూడా ఒకే నాణేనికి ఉన్న బొమ్మా బొరుసులాంటివని ఈటల అన్నారు. ''కేంద్రంలో బీజేపీ పై పోరాటంలో ఈ రెండు పార్టీలు కలిసి పని చేసిన విషయం నిజంకాదా? పార్లమెంటు బైట జరిగిన ఆందోళనల్లో రెండు పార్టీల నాయకులు ఒకే వేదిక మీద కూర్చున్న విషయం నిజంకాదా ? బీజేపీని ఓడించడానికి బీఆరెస్ తో కూడా చర్చలు జరుపుతామని మల్లికార్జున ఖర్గే చెప్పిన మాటలు నిజంకాదా ? పరువు నష్టం కేసులో ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు శిక్ష విధిస్తే దేశానికి చీకటి రోజంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానించింది నిజంకాదా ? అని ఈటల రాజేందర్ ప్రశ్నించారు.

రాష్ట్రంలో వేలాదిగా ఆర్టీఏ దరఖాస్తులు పెట్టి సమాచారం సేకరిస్తున్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఏం చేస్తారో అందరికీ తెలుసని ఈటల అన్నారు. కేబీఆర్ పార్క్ దగ్గర కడుతున్న భవనానికి సంబంధించిన పనులను అడ్డుకుంటామని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకూ అక్కడికి ఎందుకు వెళ్లలేదని, ఈ విషయంలో ఏంజరిగిందో అందరికీ తెలుసని ఈటల అన్నారు. మనం చేస్తున్న పనులు ప్రజలకు తెలియవనుకుంటే పొరపాటని, ప్రజలు అన్నీ గమనిస్తారని ఈటల అన్నారు.

First Published:  23 April 2023 8:45 AM GMT
Next Story