Telugu Global
Telangana

రూ.2వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల ఏర్పాటు.. జపాన్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి గంగుల భేటీ

దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారింది.. తొమ్మిదేళ్లలోనే పది రెట్ల ధాన్యం దిగుబడిని రాష్ట్రం సాధించిందని అన్నారు. కేసీఆర్ రైతు అనుకూల విధానాల ఫలితంగానే ఈ ప్రగతిని సాధించామని చెప్పారు.

రూ.2వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల ఏర్పాటు.. జపాన్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి గంగుల భేటీ
X

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకొక సర్కార్ మిల్లును ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. రూ.2వేల కోట్ల వ్యయంతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న మిల్లులకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, జపాన్ సటాకె కార్పొరేషన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారింది.. తొమ్మిదేళ్లలోనే పది రెట్ల ధాన్యం దిగుబడిని రాష్ట్రం సాధించిందని అన్నారు. కేసీఆర్ రైతు అనుకూల విధానాల ఫలితంగానే ఈ ప్రగతిని సాధించామని చెప్పారు. రాష్ట్రంలో అత్యుత్తమ సాంకేతికతో రైస్ మిల్లును ఏర్పాటు చేస్తుందని.. ధాన్యం మిల్లింగ్‌తో పాటు రైస్ బ్రాన్ ఆయిల్, నూక తదితరాల ప్రాసెసింగ్ సైతం చేస్తామని చెప్పారు. తెలంగాణ మిల్లింగ్ పరిశ్రమలో విస్తృత అవకాశాలు ఉన్నాయని.. అందుకే రూ.2వేల కోట్లతో జిల్లాకొక మిల్లు ఏర్పాటు చేయడానికి సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు చెప్పారు.

సటాకా కార్పొరేషన్ ప్రతినిధులతో చర్చించిన మంత్రి.. త్వరలోనే నివేదికను సీఎంకు సమర్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం మిల్లుల ఏర్పాటుతో పాటు స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టిన వారికి ప్రోత్సాహకాలు కూడా అందిస్తామని చెప్పారు.

పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు సేవల్ని మరింత కచ్చితంగా, పారదర్శకంగా అందిస్తామని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ధాన్యం సేకరణ నుంచి ప్రజా పంపిణీ వరకు వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. మెరుగైన సాంకేతికతను అమలు చేయడానికి సీఎస్ఎం, ఐబీఐ, ప్లానెట్ ఎం ప్రతినిధులతో మంత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయా కంపెనీలు ఇచ్చిన ప్రెజెంటేషన్స్‌ను మంత్రి వీక్షించారు. త్వరలోనే దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసకుంటుందని చెప్పారు.

First Published:  29 Jun 2023 2:53 AM GMT
Next Story