Telugu Global
Telangana

కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు..

తెలంగాణ రాష్ట్రానికి, సీఎం కేసీఆర్ మేధస్సుకు దక్కిన అపూర్వ గుర్తింపుగా ఈ అవార్డుని భావిస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్.

కాళేశ్వరం ప్రాజెక్ట్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు..
X

ప్రపంచంలోనే అత్యంత భారీ ఎత్తిపోతల పథకంగా ఇప్పటికే గుర్తింపు సాధించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కి మరో అరుదైన అవార్డు లభించింది. ‘ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రోగ్రెస్’ గా కాళేశ్వరంకు గుర్తింపునిచ్చింది అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ సంస్థ. ఈ అవార్డుని అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ అందుకున్నారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నిర్వహించిన వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్స్ కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ విశేషాలు, తెలంగాణ అభివృద్ధిని వివరించారు.

ఆషామాషీ ప్రాజెక్ట్ కాదు..

గోదావరి నది ఆవిర్భవించిన మహారాష్ట్రకంటే.. ఆ నది సముద్రంలో కలిసే ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువగా నదీ జలాలను వినియోగించుకుంటూ రికార్డ్ సృష్టించింది తెలంగాణ రాష్ట్రం. విశేషం ఏంటంటే.. గోదావరి నది కంటే ఎత్తులో తెలంగాణ వ్యవసాయ భూములున్నాయి. అందుకే ఎత్తిపోతల అనే అద్భుతమైన ఆలోచన చేశారు సీఎం కేసీఆర్. ఆయన ఆలోచన ఫలితమే కాళేశ్వరం.

అప్పుడు ఆశ్చర్యం, ఇప్పుడు అవార్డ్..

మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల గురించి 2017లో వాటర్ వరల్డ్ కాంగ్రెస్ సమావేశంలో వివరించామని, ఆరోజు తమ ప్రణాళికలపైన ఆశ్చర్యం వ్యక్తం చేసిన సమావేశం, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసిన కాళేశ్వరంప్రాజెక్టుకు అవార్డు అందించడం గర్వంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రానికి, సీఎం కేసీఆర్ మేధస్సుకు దక్కిన అపూర్వ గుర్తింపుగా దీన్ని భావిస్తున్నామని తెలిపారు.

ఎలా పూర్తి చేశామంటే..?

ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని అతి తక్కువ సమయంలో ఎలా పూర్తిచేశామనే విషయాన్ని అక్కడి ప్రతినిధులకు వివరించారు మంత్రి కేటీఆర్. 75 సంవత్సరాలలో ఏ రాష్ట్రం కూడా ఆలోచించని విధంగా ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించే మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పారు. ఒకప్పుడు వలసలు, రైతుల ఆత్మహత్యలు ఉన్న తెలంగాణ కాళేశ్వరం పూర్తయ్యాక కళకళలాడుతోందన్నారు.

సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తున ఉన్న నీటిని 618 మీటర్ల స్థాయికి ఎత్తిపోతల ద్వారా తీసుకుపోయి వివిధ ప్రాజెక్టులు నింపడం ప్రపంచ సాగునీటి చరిత్రలోనే ఒక అద్భుతం అన్నారు మంత్రి కేటీఆర్. ఈ ప్రాజెక్టు కోసం తరలించిన మట్టి ద్వారా 101 గిజా పిరమిడ్లు నిర్మించవచ్చని, ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన స్టీల్ ద్వారా 66 ఈఫిల్ టవర్ల నిర్మాణం చేయవచ్చని, ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన కాంక్రీట్ ద్వారా 53 బుర్జ్ ఖలీఫాలు కట్టవచ్చని చెప్పారు. ఈ భారీ ప్రాజెక్టును తెలంగాణ అతి తక్కువ సమయంలో నిర్మించడం గర్వకారణం అన్నారు కేటీఆర్.

బాహుబలి ప్రాజెక్ట్..

కాళేశ్వరం కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని ఒక ఇంజనీరింగ్ అద్భుతం అన్నారు కేటీఆర్. 13 జిల్లాల్లో సుమారు 500 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టు విస్తరించిందని, 1800 కిలోమీటర్ల పొడవున కాల్వలు నిర్మించామని, ఏడు మెగా లింకులను 28 ప్యాకేజీలుగా 22 పంపు హౌస్ లు నిర్మించామని చెప్పారు. 139 మెగావాట్ల కెపాసిటీని ఉపయోగించుకునే బాహుబలి పంపు ఉందన్నారు. నీటి నిల్వ కోసం 20 రిజర్వాయర్లు నిర్మించామని, 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్ లాంటి అతి పెద్ద రిజర్వాయర్ నిర్మించామన్నారు. దాదాపు 240 టీఎంసీల నీటిని సాగు, తాగు అవసరాల కోసం, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకునే అవకాశం లభించిందని చెప్పారు.

ఫలితం ఎలా ఉందంటే..?

కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం భారతదేశ ధాన్యాగారంగా మారిందని 90 లక్షల ఎకరాల్లో రెండు పంటలుగా సాగవుతున్నాయని చెప్పారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో సాగుభూమి 119 శాతం పెరిగిందని, ధాన్యం ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందన్నారు.

మిషన్ భగీరథ ఫలితాలివి..

మిషన్ భగీరథ ప్రాజెక్టు కూడా స్వల్ప కాలంలో పూర్తి చేశామని చెప్పారు మంత్రి కేటీఆర్. దేశంలోనే తొలిసారి వంద శాతం రక్షిత తాగునీటిని ఇంటింటికీ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు. దశాబ్దాల ఫ్లోరైడ్ సమస్య నుంచి తెలంగాణకు శాశ్వత విముక్తి లభించిందని చెప్పారు.

ఒక నాయకుడి అచంచలమైన నిబద్దతకి కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనమన్న కేటీఆర్, ఒక నదిని ఎత్తిపోసి, లక్షలాదిమంది జీవితాల్లో వెలుగును నింపి జీవనోపాది కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాగునీటి ప్రగతి ప్రస్థానం, ఇంజనీరింగ్ నైపుణ్యం, దాని ద్వారా కలిగిన మార్పులు.. ప్రపంచానికి, సివిల్ ఇంజనీరింగ్ రంగంలో ఆదర్శంగా నిలుస్తున్నాయంటే అతిశయోక్తి కాదన్నారు. భవిష్యత్తు సవాళ్లను బలంగా ఎదుర్కోవడంలో, ప్రజల జీవితాల్లో మార్పులు తేవడంలో, ఏ కల కూడా అసాధ్యం కాదని నిరూపించడానికి కాళేశ్వరం గొప్ప ఉదాహరణ అని వివరించారు కేటీఆర్.

First Published:  23 May 2023 2:48 AM GMT
Next Story