Telugu Global
Telangana

తెలంగాణలో ముగిసిన ఎన్నికల సంఘం పర్యటన.. షెడ్యూల్ ప్రకటన ఎప్పుడంటే..?

ఇటీవల ఆన్ లైన్ నగదు బదిలీ అభ్యర్థులకు అనువుగా మారిందని.. ఆ విధంగా ప్రలోభ పెట్టినా కూడా తమకు తెలిసిపోతుందన్నారు. ఓటు వేసేందుకు డబ్బులను డిమాండ్‌ చేసే వారిపై కూడా కేసులు పెడతామన్నారు.

తెలంగాణలో ముగిసిన ఎన్నికల సంఘం పర్యటన.. షెడ్యూల్ ప్రకటన ఎప్పుడంటే..?
X

తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ముగిసింది. మూడురోజులపాటు రాష్ట్రంలో పర్యటించిన అధికారులు చివరి రోజు కీలక విషయాలు వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల్లో పర్యటనలు పూర్తి చేసుకున్నామని, క్షేత్ర స్థాయి పరిస్థితులపై అవగాహన వచ్చిందని తెలిపారు. తుది ఓటర్ల జాబితా ప్రకటించామని, ఢిల్లీలో సమీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. సమీక్షల అనంతరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు.

కీలక నిర్ణయాలివే..

ఎన్నికల్లో ధనప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తామన్నారు అధికారులు. ఇటీవల ఆన్ లైన్ నగదు బదిలీ అభ్యర్థులకు అనువుగా మారిందని.. ఆ విధంగా ప్రలోభ పెట్టినా కూడా తమకు తెలిసిపోతుందన్నారు. ఆన్‌ లైన్‌ లో నగదు బదిలీల వివరాలను తెలుసుకునేందుకు బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగిస్తున్నాయని చెప్పారు. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సహకారం కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు. సీ విజిల్‌ యాప్‌ ద్వారా ప్రజలు ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదు చేయవచ్చని.. ఆధారంగా ఫొటోను యాప్‌ లో అప్‌లోడ్‌ చేస్తే 100 నిముషాల వ్యవధిలో అధికారులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేసి, ఫిర్యాదుదారుడికి సమాచారమిస్తారన్నారు.

అధికారులపై నిఘా..

ఎన్నికల అక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తామన్న సీఈసీ.. ఎన్నికల విధుల్లో ఉండే అధికారులపై కూడా నిఘా పెడతామన్నారు. అధికారులంతా ప్రత్యేక నిఘా వ్యవస్థ(రాడార్‌) పరిధిలో ఉంటారన్నారు. ఓటు వేసేందుకు డబ్బులను డిమాండ్‌ చేసే వారిపై కూడా కేసులు పెడతామన్నారు.

29 నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్..

గత ఎన్నికల్లో తెలంగాణలో 73.37 శాతం పోలింగు నమోదైంది. 29 నియోజకవర్గాల్లో మాత్రం పోలింగ్ 60 శాతం కంటే తక్కువగా ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఈసారి పోలింగ్ శాతం పెంచడంపై ఫోకస్ పెడుతున్నట్టు తెలిపారు అధికారులు. రాష్ట్రంలో 35,356 పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో మహిళలకు 597 ప్రత్యేక కేంద్రాలు, దివ్యాంగులకు 120 కేటాయించామన్నారు. ఒక్కో సెగ్మెంట్ లో యువతకు ఒక పోలింగ్ కేంద్రాన్ని కేటాయిస్తున్నట్టు చెప్పారు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్నవారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్టు స్పష్టం చేశారు.

First Published:  6 Oct 2023 2:32 AM GMT
Next Story