Telugu Global
Telangana

మునుగోడు ఎన్నికకు రంగం సిద్ధం.. ఆ రోజే అనుకూలం అనుకుంటున్న ఎన్నికల కమిషన్

కేంద్ర ఎన్నికల కమిషన్ మునుగోడు ఉపఎన్నికకు డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 8న మునుగోడు ఉపఎన్నిక నిర్వహించాలని భావిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే మునుగోడు, హర్యానాలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికకు కసరత్తు చేస్తోంది.

మునుగోడు ఎన్నికకు రంగం సిద్ధం.. ఆ రోజే అనుకూలం అనుకుంటున్న ఎన్నికల కమిషన్
X

రాజకీయ పార్టీలతో పాటు తెలంగాణ ప్రజలందరూ ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవికి, పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ మునుగోడును పట్టించుకోవడం లేదని.. తాను రాజీనామా చేస్తే అయినా ప్రాజెక్టులు, పథకాలు వస్తాయంటూ చెప్పారు. ఆయన రాజీనామా చేసిన వెంటనే పార్టీలన్నీ అప్రమత్తం అయ్యాయి. టీఆర్ఎస్, బీజేపీ ఇప్పటికే నియోజవకర్గంలో ఒక దఫా బహిరంగ సభలను నిర్వహించాయి. అయితే, మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడనేది ఇంత వరకు స్పష్టం కాలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కావాలని మునుగోడు ఉపఎన్నిక నిర్వహణను ఆలస్యం చేయిస్తుందనే ఆరోపణలు వచ్చాయి. క్షేత్ర స్థాయిలో బీజేపీకి సరైన క్యాడర్ లేకపోవడంతో ప్రచారం కోసం మరి కొంత సమయం కావాలని రాష్ట్ర నాయకత్వం అడగటం వల్లే ఎన్నికను వాయిదా వేస్తోందనే వ్యాఖ్యలు వినిపించాయి. మరోవైపు అధికార టీఆర్ఎస్ మాత్రం మునుగోడులో గెలవాలనే పట్టుదలతో ఉంది. ఎన్నిక ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశా నిర్దేశనం కూడా చేశారు.

ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల కమిషన్ మునుగోడు ఉపఎన్నికకు డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్ 8న మునుగోడు ఉపఎన్నిక నిర్వహించాలని భావిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే మునుగోడు, హర్యానాలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికకు కసరత్తు చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి జనవరిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే డిసెంబర్, జనవరి నెలల్లో ఆ రాష్ట్రంలో తీవ్రమైన మంచు కురుస్తుంది. ప్రజలు బయటకు రావడానికి కూడా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి సమయంలో ఎన్నికల సిబ్బంది సుదూర ప్రాంతాలకు వెళ్లి విధులు నిర్వర్తించడం కూడా కష్టంగానే ఉంటుంది. అందుకే నవంబర్‌లోనే ఆ రాష్ట్రానికి ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఆ రాష్ట్రంతో పాటే మునుగోడు ఉపఎన్నిక జరగనున్నట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు చెప్తున్నాయి.

ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ బృందం హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించింది. అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులు పరిశీలించిన అనంతరమే ఎన్నికల నిర్వహణ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్ల తెలుస్తోంది. గుజరాత్ అసెంబ్లీకి డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే వీటిని కూడా నవంబర్‌లోనే పూర్తి చేయడానికి కసరత్తు జరుగుతోంది. హిమాచల్‌ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు ఒకే నెలలో పూర్తి చేయనున్నారు. అదే విధంగా మునుగోడుకు కూడా ఉపఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పలు రాజకీయ పార్టీలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. త్వరలోనే మునుగోడు నోటిఫికేషన్‌ను హిమాచల్‌ప్రదేశ్‌తో కలిపి విడుదల చేసే అవకాశం ఉంది.

మునుగోడు ఉపఎన్నిక డేట్ బయటకు రావడంతో అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తం అయ్యాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నియోజకవర్గంలో సభలు, సమావేశాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాయి. దసరా తర్వాత మునుగోడులో ఎన్నికల ప్రచారం ఊపందుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మునుగోడు నియోజకవర్గ పరిధిలోని గట్టుప్పల మండలాన్ని ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దీంతో పాటు సంక్షేమ పథకాలను త్వరగా అమలు చేయాలని చూస్తోంది. వారం రోజుల్లో దళిత బందు, గిరిజన బంధు లబ్దిదారులను కూడా గుర్తించే అవకాశం ఉంది. ఇక అక్టోబర్‌లో భారత్ జోడో యాత్ర తెలంగాణలో ప్రవేశించనుంది. దీంతో రాహుల్ గాంధీతో ఒక రోజు సభ పెట్టించే అవకాశం కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా స్టీరింగ్ కమిటీని నియమించి ప్రచారాన్ని ప్రారంభించింది.

First Published:  28 Sep 2022 5:39 AM GMT
Next Story