Telugu Global
Telangana

ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి ఎంత ఖర్చు చేయొచ్చంటే..!

ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నా.. అత్యధిక మంది ఎలక్షన్ కమిషన్‌ నిర్ణయించిన పరిమితి లోపే లెక్కలు చూపిస్తున్నారు.

ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి ఎంత ఖర్చు చేయొచ్చంటే..!
X

అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార ఖర్చులను లెక్కించడంపై ఎలక్షన్ కమిషన్ స్పెషల్‌ ఫోకస్ పెట్టింది. సభలు, సమావేశాల నిర్వహణకు అయ్యే ఖర్చులు, కార్యకర్తలకు కాఫీ, టిఫిన్‌, బిర్యానీల కోసం చేసే ఖర్చును అభ్యర్థులు గతంలో తక్కువగా చూపించేవారు. కానీ, ఈసారి అలాంటి అవకాశం లేకుండా ఎన్నికల అధికారులు.. ధరల జాబితాను రూపొందించారు. ఆ లిస్టు ప్రకారమే అభ్యర్థి ఖర్చులను లెక్కకట్టనున్నారు. వాటర్ ప్యాకెట్‌ నుంచి సమావేశాల్లో ఏర్పాటు చేసే భారీ బెలూన్లు, LED స్క్రీన్లకు సైతం ధర నిర్ణయించారు.

ఒక్కో బెలూన్‌కు రూ.4 వేలు, ఎల్‌ఈడీ స్క్రీన్‌కు రూ.15 వేలను రోజు అద్దెగా పరిగణిస్తారు. ఫంక్షన్‌ హాల్‌లో సమావేశం నిర్వహిస్తే టౌన్లలో అయితే రూ. 15 వేలు అభ్యర్థి తన ఖర్చులో నమోదు చేయాలి. ఎన్నికల సంఘానికి అభ్యర్థి సమర్పించే ఎన్నికల వ్యయంలో కుర్చీలు, టేబుళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారుల పారితోషికం వివరాలూ ఉండాలని ఈసీ స్పష్టం చేసింది.

ఎన్నికల్లో అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నా.. అత్యధిక మంది ఎలక్షన్ కమిషన్‌ నిర్ణయించిన పరిమితి లోపే లెక్కలు చూపిస్తున్నారు. ఈ పరిమితిని పెంచితే కొంతైనా అక్రమాలకు అడ్డకుట్ట వేయోచ్చని భావించిన కేంద్ర ఎన్నికల సంఘం.. అభ్యర్థుల ఖర్చును 2022లో పెంచింది. 2014లో ఎంపీ అభ్యర్థి వ్యయ పరిమితి గరిష్ఠంగా రూ.75 లక్షలు ఉండగా, 2022లో ఆ మొత్తాన్ని రూ.90 లక్షలకు పెంచింది. ఎమ్మెల్యే అభ్యర్థుల వ్యయాన్ని రూ.28 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచింది. ఎనిమిదేళ్ల వ్యవధిలో పెరిగిన ఓటర్ల సంఖ్య, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని వ్యయ పరిమితిని పెంచింది.

First Published:  12 Oct 2023 3:03 AM GMT
Next Story