Telugu Global
Telangana

బీఆర్‌ఎస్‌కు శుభవార్త చెప్పిన ఎలక్షన్ కమిషన్.. ఆ 4 గుర్తులు తొలగింపు

పోలింగ్ సమయంలో కారు గుర్తుని పోలి ఉన్న ఆ నాలుగు గుర్తులతో ఓటర్లు తికమకకు గురయ్యే ప్రమాదం ఉందని బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అలానే గత ఏడాది మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ ఈ చర్చ నడిచింది.

బీఆర్‌ఎస్‌కు శుభవార్త చెప్పిన ఎలక్షన్ కమిషన్.. ఆ 4 గుర్తులు తొలగింపు
X

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముంగిట భారత్ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కి ఎలక్షన్ కమిషన్ శుభవార్త చెప్పింది. కారు గుర్తుని పోలి ఉన్న ఓ 4 గుర్తుల్ని తొలగిస్తున్నట్లు ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించింది. హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల్లో కారు గుర్తుని పోలి ఉన్న ఆటో రిక్షా, ట్రక్, ఇస్త్రీ పెట్టె, టోపీ గుర్తులని అప్పట్లో స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కేటాయించింది. దాంతో అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్.. ఆ గుర్తులని తొలగించాలని విజ్ఞప్తి చేసింది.

పోలింగ్ సమయంలో కారు గుర్తుని పోలి ఉన్న ఆ నాలుగు గుర్తులతో ఓటర్లు తికమకకు గురయ్యే ప్రమాదం ఉందని బీఆర్‌ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అలానే గత ఏడాది మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనూ ఈ చర్చ నడిచింది. కారు గుర్తుని పోలి ఉన్న సుమారు 8 గుర్తులను ఫ్రీ సింబల్స్ లిస్ట్ నుంచి తొలగించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల ప్రధానాధికారి వికాస్ రాజ్‌‌ని బీఆర్‌ఎస్ నేతలు కోరారు. ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని కూడా సమర్పించారు. దాంతో ఎట్టకేలకు ఎలక్షన్ కమిషన్‌లో కదలిక వచ్చింది.

ఓవరాల్‌గా కేంద్ర ఎన్నికల సంఘం 193 ఫ్రీ సింబల్స్‌ని తాజాగా విడుదల చేసింది. ఇందులో ఆటో రిక్షా, ట్రక్, ఇస్త్రీ పెట్టె, టోపీ గుర్తులు కూడా ఉన్నాయి. కానీ.. ఈ గుర్తులను మాత్రం ఎలక్షన్స్ టైమ్‌లో తెలుగు రాష్ట్రాల్లోని అభ్యర్థులకు కేటాయించబోమని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది.

First Published:  18 May 2023 5:09 AM GMT
Next Story