Telugu Global
Telangana

తెలంగాణలో ఆ 13 నియోజకవర్గాలు కీలకం

తనిఖీల విషయంపై కూడా కేంద్ర అధికారులు ఆరా తీశారు. రాజకీయాలు, ఎన్నికలతో సంబంధం లేకుండా తనిఖీల్లో పట్టుబడిన సామాన్యుల నగదును వెంటనే వెనక్కి ఇచ్చేయాలని రాష్ట్ర అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

తెలంగాణలో ఆ 13 నియోజకవర్గాలు కీలకం
X

తెలంగాణలోని 13 నియోజకవర్గాలపై ఎన్నికల కమిషన్ ఫోకస్ పెంచింది. కారణం ఆ 13 నియోజకవర్గాలు నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఉండటమే. ఆయా ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులను ఆదేశించింది. పోలింగ్ కేంద్రాల ఎంపిక, ఈవీఎంల తరలింపు, సిబ్బంది రక్షణ చర్యలపై దృష్టిపెట్టాలని సూచించింది. 13 నక్సల్‌ ప్రభావిత నియోజకవర్గాల్లో పోలింగ్‌ ను గంట ముందుగానే ముగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. నవంబర్‌ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే అక్కడ పోలింగ్‌ జరుగుతుంది.

భద్రాచలం, అశ్వారావుపేట, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, ములుగు, భూపాలపల్లి, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, చెన్నూర్‌, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, మంథని నియోజకవర్గాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు.. రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ, జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ అధికారులతో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలింగ్‌ సమయాన్ని గంటముందే ముగించాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనిపై నవంబర్‌ 3న ఎన్నికల సంఘం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది.

ఓట్ల తొలగింపు..

ఓట్లను తొలగించడానికి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే నాటికి 10.6 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటన్నింటిని పరిష్కరించామని తెలిపారు అధికారులు. మరో 10 వేల దరఖాస్తులు పరిశీలించాల్సి ఉందన్నారు. అక్టోబరు 9 తర్వాత ఓట్లను తొలగించడానికి వచ్చిన దరఖాస్తులను పక్కనపెడుతున్నామని, ఎన్నికల తర్వాతే వాటి విషయం తేలుస్తామని చెప్పారు. ఇక పోలింగ్ రోజు దివ్యాంగులు, వృద్ధుల కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల్లో 18 వేల వీల్‌ చైర్లను అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. తనిఖీల విషయంపై కూడా కేంద్ర అధికారులు ఆరా తీశారు. రాజకీయాలు, ఎన్నికలతో సంబంధం లేకుండా తనిఖీల్లో పట్టుబడిన సామాన్యుల నగదును వెంటనే వెనక్కి ఇచ్చేయాలని రాష్ట్ర అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

First Published:  31 Oct 2023 2:09 AM GMT
Next Story