Telugu Global
Telangana

రేవంత్ రెడ్డి కోసం ముంబై, పుణెలో ఎన్నికల ప్రచారం

రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ముంబై, పుణె వెళ్లి బంజార ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రేవంత్ ని గెలిపించాలని కోరుతున్నారు.

రేవంత్ రెడ్డి కోసం ముంబై, పుణెలో ఎన్నికల ప్రచారం
X

ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ఓ వర్గం ప్రచారం చేస్తుండగా రేవంత్ రెడ్డి గెలుపు కీలకంగా మారింగి. కొడంగల్ లో 2009, 2014లో టీడీపీ అభ్యర్థిగా రేవంత్ విజయం సాధించినా.. 2018లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం అక్కడ పోటీ చేస్తున్నారు. ఆయనపై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచిస్తున్నారు రేవంత్ రెడ్డి. తన గెలుపు కోసం ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టేందుకు రేవంత్ సిద్ధంగా లేరు. అందుకే ముంబై, పుణెలో ఆయన తరపున సోదరుడు తిరుపతి రెడ్డి ప్రచారం చేస్తున్నారు.

అక్కడే ఎందుకు..?

కొడంగల్ నుంచి వలస వెళ్లిన దాదాపు 15వేలమంది ముంబై, పుణె, నాసిక్ తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారిలో కొంతమంది ప్రతి ఎన్నికలకూ తెలంగాణకు వచ్చి ఓటు వేసి వెళ్తుంటారు. ఇప్పుడు ఆ వలస ఓట్లపై రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఆయన తరపున సోదరుడు తిరుపతి రెడ్డి ముంబై, పుణె వెళ్లి బంజార ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, రేవంత్ ని గెలిపించాలని కోరుతున్నారు. ఎన్నికల వేళ ఓటర్లందర్నీ అక్కడి నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

పోటీగా బీఆర్ఎస్..

సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఆయన సోదరుడు మంత్రి మహేందర్ రెడ్డి కూడా వలస ఓటర్లను తమవైపు తిప్పుకోడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. వారిద్దరూ గతవారం ముంబై, పుణెకి వెళ్లారు. అక్కడ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.

మొత్తమ్మీద కొడంగల్ పోటీ.. ముంబై, పుణె, నాసిక్ లో కూడా రాజకీయ వేడి రగిల్చింది. పోటా పోటీగా అభ్యర్థులు, వారి సోదరులు.. వలస ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొడంగల్ లో తిరిగి గెలిచి తన పరువు నిలుపుకోవాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్షుడిని మరోసారి ఓడించి.. ఆ గెలుపుని కేసీఆర్ కి బహుమతిగా ఇస్తానంటున్నారు నరేందర్ రెడ్డి. ఎవరిది పైచేయి అవుతుందో వేచి చూడాలి.


First Published:  3 Nov 2023 6:42 AM GMT
Next Story