Telugu Global
Telangana

ఎన్నికల ప్రచారం.. సీఎం కేసీఆర్ భారీ ప్లాన్

సీఎం కేసీఆర్ నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

ఎన్నికల ప్రచారం.. సీఎం కేసీఆర్ భారీ ప్లాన్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడానికి 50 రోజుల ముందే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి సీఎం కేసీఆర్ సంచలనం సృష్టించారు. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారం విషయంలో కూడా దూకుడు ప్రదర్శించనున్నారు. ప్రతిపక్షాలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్‌ను ముందుంచడానికి ప్రచారం కోసం భారీ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ నెల 15న అభ్యర్థులకు బీ-ఫామ్‌ను అందజేయనున్నారు. ఆ తర్వాత వరుసగా సభల్లో పాల్గొనడానికి సీఎం కేసీఆర్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 15 నుంచి నవంబర్ 9 వరకు దాదాపు 42 సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారని పార్టీ వెల్లడించింది.

సీఎం కేసీఆర్ నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అదే రోజు రెండు చోట్ల బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. నామినేషన్ల పర్వం మొదలయ్యే నాటికే సీఎం కేసీఆర్ 26 బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను ప్రకటించుకొని, ప్రచారంలోకి దిగేలోపే ప్రజల్లోకి బీఆర్ఎస్ మేనిఫెస్టోను పూర్తిగా తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. ఈ మేరకే సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటనలను ఖరారు చేసింది. ఈ నెల 15న సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి సీఎం కేసీఆర్ ప్రచారం ప్రారంభమయ్యి.. నవంబర్ 9న కామారెడ్డి సభతో ముగియనున్నది. రాష్ట్రంలోని ప్రతీ జిల్లా.. ముఖ్య పట్టణాల్లో కేసీఆర్ సభలను ప్లాన్ చేశారు.

ఇప్పటికే సీఎం కేసీఆర్ పలు జిల్లాల్లో కలెక్టరేట్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభం సందర్భంగా బహిరంగ సభలు నిర్వహించారు. అయితే ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రావడంతో పూర్తిగా ప్రచారం కోసం బీఆర్ఎస్ రంగంలోకి దిగుతున్నది. సీఎం కేసీఆర్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకంగా ఐదు సభల్లో పాల్గొననున్నారు. ఆ జిల్లాపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక సీఎం సభలతో పాటు సమాంతరంగా మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు కూడా జిల్లాల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా త్వరలోనే వెలువడే అవకాశాలు ఉన్నాయి.

సీఎం కేసీఆర్ సభలు ఇలా..

అక్టోబర్ 15 - హుస్నాబాద్

అక్టోబర్ 16 - జనగామ, భువనగిరి

అక్టోబర్ 17 - సిరిసిల్ల, సిద్దిపేట

అక్టోబర్ 18 - జడ్చర్ల, మేడ్చెల్

అక్టోబర్ 19 నుంచి 25 వరకు బతుకమ్మ సంబరాల కోసం విరామం

అక్టోబర్ 26 - అచ్చంపేట, నాగర్‌కర్నూల్, మునుగోడు

అక్టోబర్ 27 - పాలేరు, స్టేషన్ ఘన్‌పూర్

అక్టోబర్ 29 - కోదాడ, తుంగతుర్తి, ఆలేరు

అక్టోబర్ 30 - జుక్కల్, భాన్సువాడ, నారాయణ్‌ఖేడ్

అక్టోబర్ 31 - హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండ

నవంబర్ 1 - సత్తుపల్లి, ఇల్లెందు

నవంబర్ 2 - నిర్మిల్, బాల్కొండ, ధర్మపురి

నవంబర్ 3 - భైంసా, ఆర్మూర్, కోరుట్ల

నవంబర్ 5 - కొత్తగూడెం, ఖమ్మం

నవంబర్ 6 - గద్వాల, మక్తల్, నారాయణపేట

నవంబర్ 7 - చెన్నూర్, మంథని, పెద్దపల్లి

నవంబర్ 8 - సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి

నవంబర్ 9 - గజ్వేల్, కామారెడ్డి

First Published:  11 Oct 2023 2:05 AM GMT
Next Story