Telugu Global
Telangana

చేతులెత్తేసిన చేరికల కమిటీ చైర్మన్.. ఈటల అస్త్ర సన్యాసం

ఆ ఇద్దరినీ బీజేపీలోకి తేవడానికి తాను కౌన్సెలింగ్ ఇస్తుంటే, తననే కాంగ్రెస్ లోకి రావాలంటూ వారు రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారని చెప్పేశారు ఈటల.

చేతులెత్తేసిన చేరికల కమిటీ చైర్మన్.. ఈటల అస్త్ర సన్యాసం
X

పక్క పార్టీ నేతలను ఆకర్షించడానికి, అసంతృప్తితో ఉన్నవారిని ఇంకాస్త రెచ్చగొట్టి తమవైపు తిప్పుకోడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. అందులోనూ తెలంగాణలో బీజేపీ లాంటి పార్టీలకు చేరికలు చాలా అవసరం. అందుకే ఆ చేరికల బాధ్యతను అప్పట్లో కొత్తగా చేరిన ఈటల రాజేందర్ కు ఇచ్చింది అధిష్టానం. కానీ ఆయనకి అది సాధ్యం కావడంలేదు. చేరికల విషయంలో ఆయన ప్రతిసారీ ఫెయిలవుతూనే ఉన్నారు. తాజాగా మరోసారి తన ఓటమిని ఆయనే బహిరంగంగా ఒప్పుకున్నారు. తన వల్ల కాదని తేల్చేశారు.

ఈటలకు షాకిచ్చిన పొంగులేటి, జూపల్లి..

బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుని.. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఆకర్షిస్తున్నాయి. ఖమ్మంలో కాస్తో కూస్తో బలం ఉన్న ఆ ఇద్దరిని తమ జట్టులో కలుపుకోడానికి ఉబలాటపడుతున్నాయి. అయితే బీజేపీ నుంచి ఈటల ఓ అడుగు ముందుకేశారు. నేరుగా తానే వెళ్లి రెండుసార్లు వారిద్దరితో చర్చించారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. పొంగులేటి, జూపల్లిని బీజేపీలోకి రావాలని ఈటల కోరితే.. కాదు కాదు మీరే మాతోపాటు కాంగ్రెస్ లోకి రండి అంటూ వారిద్దరూ ఈటలకు బ్రెయిన్ వాష్ చేశారట. దీంతో ఈటల ఈ ఆపరేషన్ తన వల్ల కాదని చేతులెత్తేశారు.

రివర్స్ కౌన్సెలింగ్..

ఆ ఇద్దరినీ బీజేపీలోకి తేవడానికి తాను కౌన్సెలింగ్ ఇస్తుంటే, తననే కాంగ్రెస్ లోకి రావాలంటూ వారు రివర్స్ కౌన్సెలింగ్ ఇస్తున్నారని చెప్పేశారు ఈటల. వారిద్దర్నీ కాంగ్రెస్ లో చేరకుండా కొన్నిరోజులు నిలువరించగలిగాను తప్పితే, బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నంలో తాను సక్సెస్ కాలేదని చెప్పుకొచ్చారు. వారిద్దరూ బీజేపీలో చేరబోరని, కాంగ్రెస్ గూటికే వెళ్తారనే విషయాన్ని ఖాయం చేశారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉందని చెప్పారు ఈటల. మరి ఈ రివర్స్ కౌన్సెలింగ్ విషయంపై బీజేపీలోని ఇతర నాయకులు, ముఖ్యంగా ఈటల వైరి వర్గం ఎలా స్పందిస్తుందో చూడాలి.

First Published:  29 May 2023 11:40 AM GMT
Next Story