Telugu Global
Telangana

టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు

క్వశ్చన్ పేపర్స్ లీక్ కేసులో భారీగా నగదు లావాదేవీలు జరిగాయి. వీటిపైనే ఈడీ అధికారులు ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం.

టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని ప్రశ్నిస్తున్న ఈడీ అధికారులు
X

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసులో భారీగా డబ్బులు చేతులు మారాయని, విదేశాల్లో ఉన్న వ్యక్తి కూడా లీక్ అయిన ప్రశ్నపత్రాలను కొనుగోలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితులను ఈడీ ప్రశ్నించింది. తాజాగా టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను సోమవారం తమ కార్యాలయం విచారిస్తోంది.

క్వశ్చన్ పేపర్స్ లీక్ కేసులో భారీగా నగదు లావాదేవీలు జరిగాయి. వీటిపైనే ఎక్కువ ప్రశ్నలు వేస్తున్నట్లు సమాచారం. పలు కీలక అంశాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. వీరిద్దరి వాంగ్మూలాన్నీ ఈడీ అధికారులు నమోదు చేయనున్నారు. న్యాయస్థానం నుంచి తీసుకున్న ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ విచారణ చేస్తోంది. ఇప్పటికే కమిషన్‌లోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జి శంకరలక్ష్మిని విచారించింది.

కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ సత్యనారాయణకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. అత్యంత భద్రత ఉండే కంప్యూటర్లలోని ప్రశ్నాపత్రాలను ప్రధాన నిందితులు ఎలా కొట్టేశారనే విషయాలను మరో సారి అడిగి తెలుసుకున్నారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రధాన నిందితుల నుంచి వాంగ్మూలాలను ఇప్పటికే నమోదు చేశారు.

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మొత్తం రూ.38 లక్షల మేర నగదు లావాదేవీలు జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. సిట్ అధికారుల దర్యాప్తు ఆధారంగానే మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ చేస్తోంది. ఖమ్మానికి చెందిన ఒక జంటను కూడా ఈడీ అధికారులు విచారించి.. నగదు లావాదేవీలు నిజమే అని ఒక స్పష్టతకు వచ్చారు. అందుకు సంబంధించిన బ్యాంకు ట్రాన్సాక్షన్స్ కూడా గుర్తించారు. న్యూజీలాండ్‌లో ఉంటున్న వ్యక్తి నగదు ఏ రూపంలో పంపారనే విషయాలను ఆరా తీస్తున్నారు. ఈ విషయాలపై చైర్మన్, కార్యదర్శికి అవగాహన ఉన్నదా అని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. లీక్ చేసిన వ్యక్తుల వ్యవహారశైలిపై అనుమానాలు రాలేదా అని కూడా ప్రశ్నించారని తెలుస్తున్నది.

First Published:  1 May 2023 10:21 AM GMT
Next Story