Telugu Global
Telangana

తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ఏపీ అసెంబ్లీలో వైసీపీ బలం మేరకు వీరందరూ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నిక అవడం ఖాయమే.

తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
X

తెలంగాణ, ఏపీలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుల చేసింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన వేర్వేరు నోటిఫికేషన్లు మార్చి 6న వెలువడనున్నాయి. మార్చి 13 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఇక మార్చి 14న నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణకు మార్చి 16 వరకు గడువు ఉంటుంది. మార్చి 23న పోలింగ్ జరుగనున్నట్లు, అదే రోజు కౌంటింగ్ కూడా నిర్వహించనున్నట్లు ఈసీఐ తెలిపింది.

తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన నవీన్ రావు, గంగాధర్ గౌడ్, ఎలిమినేటి కృష్ణారెడ్డి పదవీ కాలం ముగియనున్నది. 2017లో ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన వీరు ఆరేళ్ల పదవీ కాలం మార్చి 29న ముగియనుండటంతో ఆ లోపే కొత్త సభ్యల నియామకం కోసం ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.

ఇక ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథ్ రెడ్డి చనిపోవడంతో 2022 నవంబర్ 2 నుంచి ఆ సీటు ఖాళీగా ఉన్నది. దీంతో పాటు నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద్, పెన్మత్స వరాహ వెంకట సూర్య నారాయణ రాజు, గంగుల ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం మార్చి 29తో ముగియనున్నది. వీరి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోనున్నారు.

ఏపీలో ఇప్పటికే అధికార వైసీపీ ఎమ్మెల్యే కోటా అభ్యర్థులను ప్రకటించింది. పెన్మత్స వరాహ వెంకట సూర్య నారాయణ రాజు, పోతుల సునీతకు మరోసారి ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చారు. వీరితో పాటు బొమ్మి ఇజ్రాయేల్, కోలా గురువులు, జయమంగళ వెంకటరమణ, చంద్రగిరి యేసురత్నం, మర్రి రాజశేఖర్‌ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో వైసీపీ బలం మేరకు వీరందరూ ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నిక అవడం ఖాయమే.




First Published:  28 Feb 2023 1:17 AM GMT
Next Story