Telugu Global
Telangana

ఒక్కో బూత్ కమిటీ 200 నుంచి 250 ఓట్లు.. మునుగోడులో కాంగ్రెస్ టార్గెట్

మునుగోడు నియోజకవర్గంలోని ప్రతీ బూత్ కోఆర్డినేటర్ ఈ విషయాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకోవాలని భట్టి చెప్పారు. ప్రస్తుతానికి ఒక్కో కోఆర్డినేటర్‌కు ఒక బూత్ ఇచ్చామని.. చురుకుగా పనిచేసే వాళ్లకు అవసరం అయితే రెండు బూత్‌లు అప్పగిస్తామని చెప్పుకొచ్చారు.

ఒక్కో బూత్ కమిటీ 200 నుంచి 250 ఓట్లు.. మునుగోడులో కాంగ్రెస్ టార్గెట్
X

కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉపఎన్నికను చాలా సీరియస్‌గా తీసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకులు మునుగోడు విషయంలో కలిసి పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. తాజాగా మునుగోడులో మీటింగ్ పెట్టిన సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు ఎలా ఓట్లు రాబట్టాలనే విషయాలను కార్యకర్తలకు వివరించారు. ప్రతీ బూత్ కమిటీ కనీసం 250 ఓట్లు కాంగ్రెస్‌కు వేయించాలని ఆదేశించారు. ప్రతీ బూత్ కమిటీలో 10 నుంచి 20 మంది క్రియాశీల కార్యకర్తలు ఉన్నారని.. వీళ్లు ఒక్కొక్కరు కనీసం 10 నుంచి 15 ఓట్లు కాంగ్రెస్‌కు పడేలా చూడాలని కోరారు.

మునుగోడు నియోజకవర్గంలోని ప్రతీ బూత్ కోఆర్డినేటర్ ఈ విషయాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకోవాలని భట్టి చెప్పారు. ప్రస్తుతానికి ఒక్కో కోఆర్డినేటర్‌కు ఒక బూత్ ఇచ్చామని.. చురుకుగా పనిచేసే వాళ్లకు అవసరం అయితే రెండు బూత్‌లు అప్పగిస్తామని చెప్పుకొచ్చారు. బూత్ కోఆర్డినేటర్లకు పైన ఓ క్లస్టర్ కోఆర్డినేటర్‌ను నియమించి.. ప్రతీ రోజు నివేదిక తెప్పించుకుంటామన్నారు. ఒక్కో క్లస్టర్ కోఆర్డినేటర్‌కు 12 బూత్‌లు ఇస్తామని చెప్పారు. ఒక్క మునుగోడు మండలంలోనే 44 బూత్‌ కమిటీలు ఉన్నాయి. వీటిని 3 నుంచి 4 క్లస్టర్లుగా విభజించాలని పార్టీ నిర్ణయించింది. నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన గట్టుప్పలతో కలిపి 7 మండలాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రతీ మండలానికి ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని ఇంచార్జీగా నియమించారు. వీళ్లు ప్రతీ రోజు బూత్ కమిటీ కోఆర్డినేటర్లు, క్లస్టర్ కోఆర్డినేటర్లతో సమన్వయం చేసుకుంటున్నారు.

భారీ సభలు, సమావేశాలు పెట్టడం కంటే ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలవడం ద్వారానే వారిని తమవైపు తిప్పుకోవచ్చని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పటికే మండలాల వారీగా ఇంచార్జీలను నియమించారు. ఇంచార్జీలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో అత్యధిక మెజార్టీ తీసుకొని వస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అభ్యంతరాలు లేకుండా టికెట్ కేటాయిస్తామని కూడా రేవంత్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కొందరు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. వీరితో రాష్ట్ర నాయకత్వం చర్చలు జరుపుతోంది. చండూర్ మండల ఇంచార్జి షబ్బీర్ అలీ కూడా తాజాగా కొంత మంది సర్పంచ్‌లతో మాట్లాడి.. ఎన్నికల్లో కలసి పని చేయాలని కోరారు. ఎమ్మెల్యే సీతక్కతో పాటు సీనియర్ నాయకులు విజయ రమణారావు కూడా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. గడపగడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించాలని వాళ్లు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

First Published:  21 Sep 2022 1:13 AM GMT
Next Story