Telugu Global
Telangana

రైతు ఉద్యమం సమయంలో మాకు మోడీ ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదురైంది : ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా నుంచి ఇలాంటి బెదిరింపులు రావడం తమకు ఆందోళన కలిగించిందని జాక్ డోర్సే పేర్కొన్నారు.

రైతు ఉద్యమం సమయంలో మాకు మోడీ ప్రభుత్వం నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదురైంది : ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే
X

సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు గతంలో సుదీర్ఘ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భారత ప్రభుత్వం నుంచి ట్విట్టర్‌కు తీవ్ర ఒత్తిడి ఎదురైందని ఆ సంస్థ మాజీ సీఈవో జాక్ డోర్సే సంచలన ప్రకటన చేశారు. ఒక టీవీ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న జాక్ డోర్సే ఈ మేరకు మోడీ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన రైతు చట్టాలపై ఆందోళన చేస్తున్న సమయంలో.. ట్విట్టర్‌కు బెదిరింపులు వచ్చాయని పేర్కొన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియా నుంచి ఇలాంటి బెదిరింపులు రావడం తమకు ఆందోళన కలిగించిందని జాక్ డోర్సే పేర్కొన్నారు. రైతులు నిరసన చేస్తున్న సమయంలో.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేసే జర్నలిస్టుల విషయంలో ట్విట్టర్‌కు ప్రభుత్వం నుంచి అభ్యర్థనలు వచ్చాయని చెప్పారు. ఆయా జర్నలిస్టుల ఖాతాలను స్తంభింప చేయాలని కోరినట్లు జాక్ డోర్సే తెలిపారు. అయితే, తాము మాత్రం ప్రభుత్వ అభ్యర్థనకు స్పందించలేదని చెప్పారు.

ఆ సమయంలో ట్విట్టర్‌ను ఇండియాలో మూసేయిస్తామని కూడా కొంత మంది బెదిరించారని.. అవసరం అయితే ట్విట్టర్‌లో పని చేసే ఉద్యోగుల ఇళ్లల్లో తనిఖీలు కూడా చేస్తామని హెచ్చరించినట్లు డోర్సే పేర్కొన్నారు. కానీ, తాము మాత్రం ఎలాంటి బెదిరింపులకు తలొగ్గలేదని చెప్పుకొచ్చారు. కాగా, ఇండియాలో ఎవరి నుంచి బెదిరింపులు ఎదుర్కున్నారో మాత్రం డోర్సే వెల్లడించలేదు.

ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సే వ్యాఖ్యలపై మంత్రి చంద్రశేఖర్ స్పందించారు. ఆయన అన్నీ అబద్దాలు చెబుతున్నారని.. డోర్సే వ్యాఖ్యల్లో అసలు ఏ మాత్రం నిజం లేదని పేర్కొన్నారు. డోర్సే హయాంలోనే భారత్‌లో ట్విట్టర్ పలే పలే నిబంధనలు ఉల్లంఘించిందని కూడా చెప్పారు. భారత్ సార్వభౌమత్వాన్ని అంగీకరించేందుకు అప్పట్లో ట్విట్టర్ అంగీకరించలేదని కూడా చెప్పారు. రైతులు ఆందోళన సమయంలో నరమేధం వంటి తీవ్రమైన అసత్య ప్రచారాలు ట్విట్టర్ వేదికగా సాగాయని చెప్పారు.

First Published:  14 Jun 2023 1:30 AM GMT
Next Story