Telugu Global
Telangana

భారీ వర్షాలతో విద్యుత్ సంస్థలకు రూ.21 కోట్లు, టీఎస్ఆర్టీసీకి రూ.12 కోట్ల మేర నష్టం

దక్షిణ తెలంగా విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో రూ.1 కోటి నష్టం వాటిల్లగా.. అత్యధికంగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

భారీ వర్షాలతో విద్యుత్ సంస్థలకు రూ.21 కోట్లు, టీఎస్ఆర్టీసీకి రూ.12 కోట్ల మేర నష్టం
X

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు విద్యుత్ సంస్థలకు ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు పేర్కొన్నారు. వరదల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో రెండు విద్యుత్ పంపిణీ సంస్థలు కూడా యుద్ద ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నాయని తెలిపారు. ఈ రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు రూ.21 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

వరంగల్ కేంద్రంగా ఉన్న టీఎస్ఎన్‌పీడీసీఎల్ పరిధిలోని హన్మకొండ, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 740 గ్రామాల పరిధిలో 2,787 స్తంభాలు.. 538 ట్రాన్స్‌ఫార్మర్లు, 130 సబ్‌స్టేషన్లు నీటిలో మునిగిపోయాయి. 459 ఫీడర్ల పరిధిలో కరెంటు సరఫరా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం భారీ వర్షాలు కురవక పోయినా కొన్ని ప్రాంతాల్లో ముంపు ఇంకా అలాగే ఉన్నది. 1891 విద్యుత్ స్తంభాలు, 300 ట్రాన్స్‌ఫార్మర్లు ఇంకా వరద నీటిలోని మునిగిపోయి ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు ప్రతీ జిల్లాకు ఇద్దరు ప్రత్యేక విద్యుత్ అధికారులను, కాంట్రాక్టు ఏజెన్సీలను నియమించినట్లు అధికారులు తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 605 స్తంభాలు, 7 ట్రాన్స్‌ఫార్మర్లు పాడవగా..వాటిని పునరుద్దరించినట్లు సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. దక్షిణ తెలంగా విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో రూ.1 కోటి నష్టం వాటిల్లగా.. అత్యధికంగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో రూ.20 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.

టీఎస్ఆర్టీసీకి..

వర్షాల కారణంగా టీఎస్ఆర్టీసీ ఆదాయాన్ని కోల్పోయింది. ఈ నెల 27న బస్సులు నడవక పోవడంతో తీవ్ర నష్టాన్ని చూడాల్సి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆ ఒక్క రోజే 8.30 లక్షల కిలోమీటర్ల మేర బస్సుల రాకపోకలు రద్దయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 45 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండగా.. గురువారం మాత్రం 16.1 లక్షల మంది మాత్రమే ప్రయాణించినట్లు అధికారులు వెల్లడించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాల పరిధిలో కొన్ని రోజులుగా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో ఆ మేరకు ఆదాయం కూడా భారీగా పడిపోయినట్లు అధికారులు తెలిపారు.

హైదరాబాద్-విజయవాడ మార్గంలో మున్నేరు వాగు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయంగా నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులు నడిపారు. దీని వల్ల ఆర్టీసీ ఆదాయం పడిపోయిందని తెలిపింది. వర్షాల కారణంగా వారం రోజుల నుంచి ఆర్టీసీ ఆదాయం క్రమక్రమంగా తగ్గిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజుల్లో ఆర్టీసీకి రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.

First Published:  29 July 2023 2:41 AM GMT
Next Story