Telugu Global
Telangana

కాంగ్రెస్ లో చేరికపై 'డీఎస్' ట్విస్ట్!

తాను కాంగ్రెస్ లో చేరడం లేదని తన కుమారుడు సంజయ్ మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని, తనకు ఆరోగ్యం సహకరిస్తే గాంధీభవన్ వెళ్ళి సంజయ్ ని ఆశీర్వదిస్తానని ఈ రోజు ఉదయం ప్రకటించారు డీఎస్.

కాంగ్రెస్ లో చేరికపై డీఎస్ ట్విస్ట్!
X

అనేక ఏళ్ళపాటు కాంగ్రెస్ పార్టీలో పని చేసి, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా పదవులు అనుభ‌వించి, అనంతరం టీఆరెస్ లో చేరి రాజ్యసభ సభ్యత్వం పొంది, క్రమంగా ఆ పార్టీకి కూడా దూరమైన డీఎస్ అనబడే డీ. శ్రీనివాస్ ఈ రోజు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.

గతంలో డీఎస్ తో పాటు ఆయన పెద్ద కుమారుడు సంజయ్ కూడా టీఆరెస్ లో చేరారు. ఆయన చిన్న కుమారుడు అరవింద్ బీజేపీలో చేరి నిజామాబాద్ ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడు డీఎస్, సంజయ్ లు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అద్వర్యంలో వారు కాంగ్రెస్ చేరతారని వార్తలు వచ్చాయి. అయితే తాను కాంగ్రెస్ లో చేరడం లేదని తన కుమారుడు సంజయ్ మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడని, తనకు ఆరోగ్యం సహకరిస్తే గాంధీభవన్ వెళ్ళి సంజయ్ ని ఆశీర్వదిస్తానని ఈ రోజు ఉదయం ప్రకటించారు డీఎస్.

అయితే డీఎస్ ఈ ప్రకటన చేసిన కొద్ది సేపటికే యూ టర్న్ తీసుకున్నారు. సంజయ్ తో పాటు గాంధీ భవన్ కు వచ్చిన ఆయన తాను కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించారు. ఆరోగ్యం బాగా లేకపోవడంతో వీల్ చైర్ లో గాంధీభవన్ కు వచ్చిన డీఎస్, ''కాంగ్రెస్ లో చేరుతున్నాను కాబట్టే గాంధీభవన్ కు వచ్చాను. నేను కాంగ్రెస్ వ్యక్తిని . నా రక్తంలో కాంగ్రెస్ సిద్దాంతాలున్నాయి. నన్ను ఒకరు కాంగ్రెస్ లో చేర్చుకునేదేంటి ? '' అని మీడియాతో వ్యాఖ్యానించారు.

రాహుల్ గాంధీ గొప్ప నాయకుడని, తాను ఊహించినదానికన్నా గొప్పగా పనిచేస్తున్నాడని అన్నారు డీఎస్. అసలు రాహుల్ పై అనర్హత వేటు వేసే అర్హత వారికుందా అని బీజేపీ పై మండిపడ్డారు.

First Published:  26 March 2023 5:56 AM GMT
Next Story