Telugu Global
Telangana

డ్రోన్ షో అదిరిపోయిందంతే.. కేటీఆర్ ప్రశంసలు

డ్రోన్ షో అద్భుతం అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ చిత్రాలను పోస్ట్ చేశారు. తరచూ ఇలాంటి అద్భుతాలను చూపించాలని కోరారు.

డ్రోన్ షో అదిరిపోయిందంతే.. కేటీఆర్ ప్రశంసలు
X

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సురక్షా దినోత్సవంలో డ్రోన్ షో హైలెట్ అయింది. డ్రోన్ షో అంటే.. నాలుగైదు డ్రోన్ కెమెరాలను పైకి ఎగురవేసి వాటిని జనాలకు చూపిస్తారనుకున్నారంతా. కానీ డ్రోన్లతో తెలంగాణ పోలీసులు మేజిక్ చేశారు. ఆకాశంలో అద్భుతం సృష్టించారు. వందల డ్రోన్లు ఆకాశంలో అందమైన చిత్రాల్ని గీశాయి. సీఎం కేసీఆర్ చిత్రపటంతో మొదలై.. తెలంగాణ విజయగాధల్ని ఆవిష్కరించాయి.

ఈ డ్రోన్ షో కి దుర్గం చెరువు వేదికగా మారింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ పై రాత్రి డ్రోన్ షో నిర్వహించారు. 500 డ్రోన్లతో ఆకట్టుకునే చిత్రాలను ఆకాశంలో ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ ఫొటో సహా.. జై తెలంగాణ, జై భారత్‌ అనే నినాదాలను చూపించారు. సైబరాబాద్‌ పోలీస్‌, షీటీమ్స్‌, కాళేశ్వరం ప్రాజెక్టు, పోలీస్ ఇమేజ్ టవర్స్, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారకం.. తదితర లోగోలను డ్రోన్లు గాలిలోనే గీసేశాయి. డ్రోన్ షో అద్భుతం అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ చిత్రాలను పోస్ట్ చేశారు. తరచూ ఇలాంటి అద్భుతాలను చూపించాలని కోరారు.


సందర్శకుల కేరింతలు..

సురక్షా దినోత్సవం సందర్భంగా ఉదయం నుంచి తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు జరిగాయి. పోలీస్ వాహనాల పరేడ్, బైక్ ర్యాలీ ఆకట్టుకున్నాయి. సాయంత్రం సినీ తారలు, క్రీడాకారులు ముఖ్య అతిథులుగా హాజరైన కార్యక్రమాలు కూడా అలరించాయి. రాత్రి దుర్గం చెరువు దగ్గర జరిగిన డ్రోన్ షో మాత్రం ఆహుతుల్ని కట్టిపడేసింది. డ్రోన్ షో చూస్తున్నంత సేపు సందర్శకులు కేరింతలు కొట్టారు. డ్రోన్లతో ఇలాంటి అద్భుతాలు కూడా చేయొచ్చా అని అబ్బురపడ్డారు.

First Published:  5 Jun 2023 1:32 AM GMT
Next Story