Telugu Global
Telangana

సజ్జనార్ సార్.. జర వీళ్ల సంగతి చూడండి

అక్కడే ఉన్న మిగతా మహిళలు కూడా బాధితురాలికి మద్దతుగా నిలిచారు. అందరు డ్రైవర్లు ఇలానే చేస్తున్నారు. ఆడవాళ్లు కనిపిస్తే చాలు బస్సు ఆపకుండా పోతున్నారు అంటూ మరో మహిళ చెప్పుకొచ్చింది.

సజ్జనార్ సార్.. జర వీళ్ల సంగతి చూడండి
X


తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చినరోజు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం వార్తల్లో నిలుస్తూనే ఉంది. మొన్నటివరకు బస్సుల్లో సీట్ల కోసం జుట్లు పట్టుకుని కొట్టుకున్న మహిళలు.. ఇప్పుడు మాకు ఫ్రీ బస్సు లేకున్నా మంచిదే అంటున్నారు. ఫ్రీ బస్సు పేరు చెప్పి మమ్మల్ని ఎందుకిలా మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు కనిపిస్తే చాలు బస్సులో జనాలున్నా, లేకున్నా డ్రైవర్లు ఆపకుండా వెళ్లిపోతున్నారని మండిపడుతున్నారు. ఇదే విషయమై ధర్మారం బస్టాండ్‌లో ఓ మహిళ తన గోడు వెళ్లబోసుకుంది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మ్యాటర్‌లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన మహిళ అర్జెంట్ పనిమీద మంచిర్యాల జిల్లా మందమర్రికి వెళ్లాలి. ఇందుకోసం ఉదయం 7 గంటలకే వచ్చి స్టాపులో నిల్చుని బస్‌కోసం ఎదురుచూస్తోంది. అయితే ఆమెను చూసి కూడా డ్రైవర్‌ బస్సు ఆపకుండా వెళ్లిపోయాడు. వేరే బస్సు వచ్చే వరకు ఎదురుచూసిన ఆ మహిళ ధర్మారం బస్టాండుకు చేరుకుంది. ఆగ్రహంతో ఊగిపోతూ ఆర్టీసీ అధికారులుండే చోటుకు చేరుకుంది. ఘటనపై ఫిర్యాదు చేద్దామని వెళ్తే అక్కడ ఒక్క అధికారి కూడా లేడు. దీంతో తోటి ప్రయాణికుల ముందు తన బాధను వెళ్లగక్కింది.

అక్కడే ఉన్న మిగతా మహిళలు కూడా బాధితురాలికి మద్దతుగా నిలిచారు. అందరు డ్రైవర్లు ఇలానే చేస్తున్నారు. ఆడవాళ్లు కనిపిస్తే చాలు బస్సు ఆపకుండా పోతున్నారు అంటూ మరో మహిళ చెప్పుకొచ్చింది. ఇవాళ ఎగ్జామ్‌ ఉంది ఒక బస్సు కూడా ఆపలేదు. టైం అయిపోతుందని బండి మీద వచ్చానంటూ మరో మహిళ తన కష్టాన్ని చెప్పుకుంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళల బాధలు విన్నవాళ్లంతా వారికి మద్దతు తెలుపుతున్నారు. సజ్జనార్ సార్ ఆ డ్రైవర్ల సంగతేంటో చూడండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.

First Published:  5 Feb 2024 3:02 AM GMT
Next Story