Telugu Global
Telangana

హైద‌రాబాద్‌ నగర శివారులో శిలాయుగపు చిత్రకళపై మరిన్ని పరిశోధనలు

గుట్ట కింద సూక్ష్మరాతి యుగపు పనిముట్లు, కొత్తరాతి యుగంలో రాతిగొడ్డళ్లను అరగదీసిన గుంటలు, ఒక ఇనుప యుగం సమాధి ఆనవాళ్లు, ఈ రేఖాచిత్రాలు పురాత‌న‌ చరిత్రకు ఆధారాలని, వీటిని కాపాడుకోవాలన్నారు.

హైద‌రాబాద్‌ నగర శివారులో శిలాయుగపు చిత్రకళపై మరిన్ని పరిశోధనలు
X

డాక్ట‌ర్‌ ద్యావనపల్లి సత్యనారాయణ 2017లో హైద‌రాబాద్ నగర శివారులోని యాడారం వద్ద వెలుగులోకి తెచ్చిన ఆదిమానవుని అడుగుజాడలు, శిలాయుగపు చిత్రకళ స్థావరాన్ని పునః పరిశీలించి మరిన్ని విషయాలను తెలుసుకున్నట్లు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్ట‌ర్‌ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. శ్రీరామోజు హరగోపాల్ నేతృత్వంలోని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు మహమ్మద్ నసీరుద్దీన్, అహోబిలం కరుణాకర్ తో కలిసి మేడ్చల్- మల్కాజ్‌గిరి జిల్లా, షామిర్ పేట మండలం, యాడారం గ్రామంలోని పెద్ద అంతరాల (అంతస్తుల) గుట్ట పైనున్న ఆదిమానవుని కొండచరియ ఆవాసాలను, వాటి గోడలపై ఉన్న ఆనాటి వర్ణ చిత్రాలను పునఃపరిశీలించారు.



నాలుగు అంతస్తుల రాతి ఆవాసపు మూడో అంతస్తులో 60 అడుగుల ఎత్తులో పక్కపక్కనున్న రెండు నిలువుబండలపై సూక్ష్మరాతి యుగానికి (క్రీ.పూ.8500) చెందిన మూపురమున్న, మూపురం లేని ఎద్దు బొమ్మలు, శరీరం లోపలి ఎముకలు కనిపించేట్లు(ఎక్స్ రే) చిత్రించిన మరో ఎద్దు బొమ్మ, మూడు మనుషుల బొమ్మలు, కొత్త రాతి యుగానికి చెందిన(క్రీ.పూ.4000), ఎద్దు, నెమలి బొమ్మలు, ఇనుప యుగానికి (క్రీ.పూ.1000) చెందిన ముగ్గులను పోలిన రేఖాచిత్రాలు, చారిత్రక తొలి యుగపు (క్రీ. శ. 1-2 శతాబ్దాలు) శృంగార భంగిమలో ఉన్న మూడు జంటలు, ఒకే దానిపై ఒకటి నిలబడి తేనె పట్టును అందుకుంటున్న ఎనిమిది కోతులు, పక్కనున్న మరో బండపై కొత్త రాతియుగపు ఎద్దును లాగుతున్న మనిషి, పక్కనే ఆవు దూడ బొమ్మలు ఉన్నాయని, ఈ రేఖాచిత్రాలన్నీ ఎర్రజాజు రంగు తో వేసినవని, ఇవి సూక్ష్మరాతి యుగం నుంచి చారిత్రక తొలి యుగం వరకు ఈ పెద్ద అంతరాల గుట్ట నివాస స్థావరమని తెలియజేస్తున్నాయని ద్యావనపల్లి సత్యనారాయణ పరిశోధనలో తేలిందని శివనాగిరెడ్డి వివరించారు.

గుట్ట కింద సూక్ష్మరాతి యుగపు పనిముట్లు, కొత్తరాతి యుగంలో రాతిగొడ్డళ్లను అరగదీసిన గుంటలు, ఒక ఇనుప యుగం సమాధి ఆనవాళ్లు, ఈ రేఖాచిత్రాల పురాత‌న‌ చరిత్రకు ఆధారాలని, వీటిని కాపాడుకోవాలని, రాజీవ్ రహదారికి మూడు కిలోమీటర్ల దూరంలో గల ఈ స్థావరం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రాచీన ఆలయ పునరుద్ధరణ ట్రస్ట్ ఛైర్మన్ ఆర్.కె. జైన్, స్థానిక యువకుడు వేణుమాధవ్ పాల్గొన్నారని శివనాగిరెడ్డి తెలిపారు.

First Published:  14 Feb 2024 7:07 AM GMT
Next Story