Telugu Global
Telangana

హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ కారిడార్ కు నేడు శంకుస్థాపన

ఈ మొత్తం కారిడార్ పొడ‌వు 5.3 కిలోమీట‌ర్లు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.6 కిలోమీట‌ర్లు ఉంటుంది. కారిడార్‌పైకి వెళ్లేందుకు వీలుగా బోయిన‌ప‌ల్లి జంక్షన్ స‌మీపంలో రోడ్డుకి ఇరువైపులా ర్యాంప్ లు నిర్మిస్తారు.

హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ కారిడార్ కు నేడు శంకుస్థాపన
X

హైదరాబాద్ శిగలో మరో మణిహారంలా మారబోతోంది డబుల్ డెక్కర్ కారిడార్. ఆరు లైన్ల రోడ్, ఆ పైన మెట్రో రైలు.. ఇదీ ఈ ప్రాజెక్ట్ రూపం. రూ.1,580 కోట్ల వ్యయంతో 5.3 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ నిర్మాణం చేపట్టబోతున్నారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ముందుగా సిక్స్ లైన్ రోడ్ మార్గం నిర్మిస్తారు, ఆ తర్వాత మెట్రో మార్గం నిర్మిస్తారు. ఇన్నాళ్లూ రక్షణ శాఖ భూముల వ్యవహారంలో మెలికపడగా.. ఇటీవల కేంద్రం క్లియరెన్స్ ఇవ్వడంతో డబుల్ డెక్కర్ కారిడార్ హైదరాబాద్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతోంది.

హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌తో పాటు మేడ్చల్-మ‌ల్కాజ్ గిరి, మెద‌క్‌, కామారెడ్డి, నిర్మల్‌-ఆదిలాబాద్ మీదుగా సాగే జాతీయ రహదారి-44 వల్ల జంట న‌గ‌రాల పరిధిలో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీన్ని నివారించేందుకే ఈ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మిస్తున్నారు. సికింద్రాబాద్ ప్రాంతంలో రోడ్ల విస్తర‌ణ‌, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి రక్షణ శాఖ భూముల వ్యవహారం అడ్డంకిగా మారింది. వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి బ‌ద‌లాయించాల‌ని, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమ‌తులు మంజూరు చేయాలంటూ చేసిన వినతులు ఇటీవల ఫలించాయి. దీంతో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం మొదలవుతోంది.

ఎక్కడినుంచి ఎక్కడి వరకు..?

డబుల్ డెక్కర్ కారిడార్ సికింద్రాబాద్‌లోని ప్యార‌డైజ్ జంక్షన్ నుంచి మొద‌లై తాడ్‌బండ్ జంక్షన్‌, బోయిన‌ప‌ల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫామ్ రోడ్డు వ‌ద్ద ముగుస్తుంది. ఈ మొత్తం కారిడార్ పొడ‌వు 5.3 కిలోమీట‌ర్లు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 4.6 కిలోమీట‌ర్లు ఉంటుంది. అండ‌ర్ గ్రౌండ్ ట‌న్నెల్ పొడవు 0.6 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 131 పిల్లర్లు ఉంటాయి. ఎలివేటెడ్ కారిడార్‌పైకి వెళ్లేందుకు వీలుగా బోయిన‌ప‌ల్లి జంక్షన్ స‌మీపంలో రోడ్డుకి ఇరువైపులా ర్యాంప్ లు నిర్మిస్తారు.

బీఆర్ఎస్ కృషివల్లే..

రక్షణ శాఖ భూముల బదలాయింపుకోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం కేంద్రం మీనమేషాలు లెక్కపెట్టింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూముల వ్యవహారంలో నిర్ణయం తీసుకుంది.

First Published:  9 March 2024 4:23 AM GMT
Next Story