Telugu Global
Telangana

హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు.. వచ్చే వారం నుంచే రోడ్లపైకి..

Double decker buses in Hyderabad: నగరవాసుల కోరిక మేరకు హెచ్ఎండీఏ రెండు మూడు రోజుల్లో హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులను నడపడానికి రంగం సిద్ధం చేస్తోంది.

హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు.. వచ్చే వారం నుంచే రోడ్లపైకి..
X

హైదరాబాద్‌వాసులకు హెచ్ఎండీఏ గుడ్ న్యూస్ చెప్పింది. ఒకప్పుడు సిటీ రోడ్లపై రయ్ రయ్ మంటూ పరుగులు తీసిన డబుల్ డెక్కర్ బస్సులు 2003 తర్వాత కనుమరుగు అయ్యాయి. అప్పటి నుంచి డబుల్ డెక్కర్ బస్సులు చాలా మందికి తీపి గుర్తులుగానే మిగిలిపోయాయి. తెలంగాణ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ స్వయంగా ఈ డబుల్ డెక్కర్ బస్సులు నగరంలో లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. తాను చిన్నప్పుడు ఈ బస్సులే ఎక్కి స్కూల్‌కు వెళ్లే వాడినని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత చాలా మంది డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు.

నగరవాసుల కోరిక మేరకు హెచ్ఎండీఏ రెండు మూడు రోజుల్లో హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులను నడిపేందుకు రంగం సిద్ధం చేసింది. ఫార్ములా ఈ రేసులు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. దాని కంటే ముందే ఆరు ఎన్వినార్‌మెంట్ ఫ్రెండ్లీ, ఎనర్జీ ఎఫీషియంట్ బస్సులను నగరంలోని టూరిస్ట్ స్పాట్స్‌కు తిప్పడానికి నిర్ణయం తీసుకున్నది. హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ పర్యటక స్థలాలైన చార్మినార్, గోల్కొండ ఫోర్ట్, కుతుబ్ షాహీ టూంబ్స్, హుస్సేన్‌సాగర్ వంటి ప్రదేశాలకు ఈ బస్సులు తిప్పనున్నారు.

ఈ డబుల్ డెక్కర్ బస్సుల్లో పూర్తిగా ఏసీ ఉంటుంది. అంతే కాకుండా లైట్ వెయిట్ కుషన్ సీట్లు అమర్చారు. కార్లలో కూర్చొని ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో.. అలాంటి అనుభూతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 65 సీట్లు ఉంటాయని.. ఒక్కో బస్సు ఖరీదు రూ.2 కోట్లని అధికారులు వివరించారు. ఈ బస్సులను టీఎస్ఆర్టీసీ కాకుండా హెచ్ఎండీఏనే నిర్వహించనున్నది. ప్రైవేట్ డ్రైవర్లను కాంట్రాక్ట్ బేసిస్ కింద తీసుకొని బస్సులను నడపనున్నారు. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు ఈ బస్సులు రోడ్లపై తిరగనున్నాయి.

ఎన్టీఆర్ గార్డెన్స్, సంజీవయ్య పార్క్ దగ్గర వీటికి పార్కింగ్, బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ బస్సులు అక్కడి నుంచే ఊరిలోని టూరిస్ట్ స్పాట్స్‌కు వెళ్తాయి. అయితే దీనికి సంబంధించిన టికెట్ రేట్లు ఇంకా నిర్ణయించలేదు. మెట్రో రైలు చార్జీల లాగే ఈ బస్సు చార్జీలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అత్యధికంగా రూ.65కు అటు ఇటుగా ఉండొచ్చు. అయితే ఒకే టికెట్‌పై టూర్ ఉండాలా లేదంటే స్టాప్-టూ-స్టాప్ టికెట్‌ను అమలు చేయాలా అనే విషయంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

హెచ్ఎండీఏ కొనుగోలు చేసిన ఈ బస్సులను.. ఆ సంస్థే నిర్వహించి, ఆపరేట్ చేస్తుంది. రెండేళ్ల పాటు లేదా రెండు లక్షల కిలో మీటర్ల వారంటీ.. ఐదేళ్ల యాన్యువల్ మెయింటెనెన్స్‌తో బస్సు తయారీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.

గ్రీన్ డబుల్ డెక్కర్.. ఒక నోస్టాల్జియా

హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు 1946లో ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిజాం ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో ఈ బస్సులు చేరాయి. ఆల్బియన్ సీఎక్స్ 19 మోడల్‌కు చెందిన 30 బస్సులను ఇంగ్లాండ్ నుంచి హైదరాబాద్‌కు తెప్పించారు. 56 సీట్లు కలిగి ఉండే ఈ బస్సుల భాగాలను విడివిడిగా షిప్ ద్వారా ముంబైకి రవాణా చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తీసుకొని రాగా.. ఆల్విన్ మెటల్ వర్క్స్ కంపెనీ ఆ భాగాలన్నింటినీ ఒక దగ్గరకు చేర్చి బస్సు నిర్మాణాన్ని పూర్తి చేసింది.

హైదరబాద్‌లో పలు ప్రాంతాలకు మొదట్లో చెర్రీ కలర్‌లో ఉన్న బస్సులు తిరిగేవి. ఏపీఎస్ఆర్టీసీగా మారిన తర్వాత బస్సు కలర్‌ను ఆకుపచ్చ రంగులోకి మార్చారు. ముఖ్యంగా నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు వెళ్లే '7Z' బస్సు ఎక్కడానికి పిల్లలు, పెద్దలు పోటీ పడేవారు. బస్సు రాగానే గబగబా మెట్లపైకి ఎక్కి ముందు ఉండే సీటు కోసం ఆరాటపడేవారు. ఈ జనరేషన్‌కు తెలియకపోయినా.. పాత జనరేషన్ పిల్లలకు ఇవన్నీ ఓ తీపి జ్ఞాపకాలు. కాగా, హైదరాబాద్ నగరంలో ప్లై ఓవర్ల నిర్మాణం పెరిగిపోవడం, బస్సుల మెయింటెనెన్స్ ఖర్చులు భారీగా ఉండటంతో 2003లో ఏపీఎస్ఆర్టీసీ బస్సులను మూలకు పెట్టేసింది. ఇప్పుడు తాజాగా కొత్త రకం ఏసీ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వస్తుండటంతో.. నగరవాసులు వారి పాత జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.


First Published:  3 Feb 2023 3:57 AM GMT
Next Story