Telugu Global
Telangana

హైదరాబాద్ లో సంఘటన... మతపిచ్చితో మూర్ఖంగా తయారవుతున్న మనుషులు

హైదరాబాద్ లో జరిగిన ఓ సంఘటన ఆందోళన కలిగించే విధంగా ఉంది. స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి తనకు ముస్లిం డెలివరీ బాయ్ డెలివరీ చేయొద్దంటూ కండీషన్ పెట్టడం విమర్శ‌లకు దారి తీసింది.

హైదరాబాద్ లో సంఘటన... మతపిచ్చితో మూర్ఖంగా తయారవుతున్న మనుషులు
X

ఈ మధ్య కాలంలో మత విద్వేషాలు పెరిగిపోతున్నాయి. తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు ప్రజల మనసుల్లో విద్వేషాన్ని నూరిపోస్తున్నాయి. గంగా, జమునా తెహజీబ్ వంటి తెలంగాణలో కూడా ఆ పిచ్చి తలకెక్కి కొట్టుకుంటున్న వాళ్ళ శాతం పెరిగిపోతోంది.

ఆహారాన్ని ఆర్డర్ చేసే యాప్ స్విగ్గీలో హైదరాబాద్ కు చెందిన ఓ మూర్ఖుడు ఆహారాన్ని ఆర్డర్ ఇవ్వడంతో ఆగకుండా ముస్లిం డెలివరీ బాయ్ డెలివరీ చేయకూడదంటూ కండీషన్ పెట్టాడు. అతని మూర్ఖపు కండీషన్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి నెటిజనులు అతనిపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆహారానికి కూడా మతం ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. మత విద్వేషాలు తలకెక్కించుకొని మనిషితనం కోల్పోతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ స్క్రీన్ షాట్ ను షేర్ చేసిన తెలంగాణ రాష్ట్ర టాక్సీ అండ్ డ్రైవర్స్ JAC చైర్మన్ షేక్ సలావుద్దీన్, ఇటువంటి వాటికి వ్యతిరేకంగా స్విగ్గీ స్టాండ్ తీసుకోవాలని కోరారు.

"ప్రియమైన స్విగ్గీ, దయచేసి ఇలాంటి మూర్ఖపు అభ్యర్థనకు వ్యతిరేకంగా ఒక స్టాండ్ తీసుకోండి. మేము (డెలివరీ వర్కర్లు) హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు అని తేడా లేకుండా అందరికీ ఆహారాన్ని పంపిణీ చేస్తాము. మజబ్ నహీ సిఖాతా ఆపస్ మే బైర్ రఖ్నా (sic)" అని ట్వీట్ చేశాడు.

అయితే ఈ వైరల్‌ ట్వీట్‌పై స్విగ్గీ ఇంకా స్పందించలేదు.

ఇదిలా ఉంటే, మరో సంఘటనలో, నగరంలోని ఒక స్విగ్గీ వినియోగదారుడు ముస్లిం డెలివరీ బాయ్ తన కోసం తెచ్చిన ఆహారాన్ని తిరస్కరించాడు. డెలివరీ సూచనలలో తాను హిందూ డెలివరీ బాయ్ మాత్రమే కావాలని రాసినప్పటికీ ముస్లిం బాయ్ ని పంపించారంటూ ఆయన ఆర్డర్ ను తిరస్కరించాడు.

ఇలా ప్రతి దాంట్లో మతాన్ని వెతుక్కుంటున్న మూర్ఖులు పెరిగిపోతూ ఉంటే ఈ దేశం అంధకార, అనాగరిక‌ మధ్యయుగాల్లోకి తిరిగి చేరుకోవడానికి ఎక్కువకాలం పట్టకపోవచ్చు.

First Published:  1 Sep 2022 7:39 AM GMT
Next Story