Telugu Global
Telangana

రోడ్లపై పిచ్చి వేషాలు వేయకండి.. యువకులకు సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇటీవల కొంత మంది యువకులు సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం ఇలాంటి ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారు.

రోడ్లపై పిచ్చి వేషాలు వేయకండి.. యువకులకు సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్
X

రోడ్లపై ప్రమాదకరమైన రీతిలో వాహనాలు నడిపే యువకులకు టీఎస్ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సరదా కోసం రోడ్లపై ప్రమాదకరమైన ఫీట్లు చేసే యువకుల వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందో వివరించారు. ఇటీవల ఆర్టీసీ బస్సును వెనుక నుంచి టూ వీలర్‌పై ఫాలో అయిన యువకుడు.. దానిపై కాలు పెట్టి ప్రయాణించిన వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్టు చేశారు. ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని ఇలాంటి ఫీట్లు చేయవద్దని ఆయన హెచ్చరించారు.

'వెర్రి వేయి విధాలు అంటే ఇదే.. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారిన పడి మీ తల్లిదండ్రులకు శోకాన్ని మిగల్చకండి. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం ఉపేక్షించదు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది' అని వీసీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

ఇటీవల కొంత మంది యువకులు సోషల్ మీడియాలో లైకులు, కామెంట్ల కోసం ఇలాంటి ప్రమాదకరమైన ఫీట్లు చేస్తున్నారు. గతంలో కూడా సజ్జనార్ దృష్టికి ఒక వీడియో వెళ్లింది. టూ వీలర్‌పై పడుకొని చేతులు వదిలేసి బైక్ రైడ్ చేసిన యువకుడు.. నేరుగా వెళ్లి రోడ్డు పక్కన ఉన్న షాపును ఢీకొట్టాడు. అప్పుడే ఆయన ఇలాంటి ఫీట్లు చేయవద్దని చెప్పారు. తాజాగా మరో యువకుడు ఆర్టీసీ బస్సుపై కాలు పెట్టి ఫీట్లు చేసి.. దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఆర్టీసీ యాజమాన్యం ఫిర్యాదు మేరకు సదరు యువకుడిని ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు.

ఆర్టీసీ బస్సులను ఉపయోగించుకొని ఫీట్లు చేస్తే.. ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి డేంజర్ ఫీట్ల వల్ల వారికే కాకుండా.. ఇతర వాహన చోదకులు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర శివార్లలో ఇలాంటి ఆకతాయి పనులు చేసే యువకులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అందుకే ఈ వీడియో పెట్టి వీసీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేసినట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, వైరల్ అయిన వీడియోలో ఉన్న యువకుడు బైక్‌పై రూ.3వేలకు పైగా చలానాలు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు.


First Published:  3 May 2023 3:05 AM GMT
Next Story