Telugu Global
Telangana

ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండండి.. కరోనాపై మంత్రి హరీశ్ రావు సూచన

రాబోయే మూడు వారాలు క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి సీజన్ కావడంతో కోవిడ్ విస్తరించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో మంత్రి హరీశ్ రావు సూచించారు.

ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉండండి.. కరోనాపై మంత్రి హరీశ్ రావు సూచన
X

కరోనా కొత్త వేరియంట్ BF.7 చైనాను వణికిస్తోంది. ఇది ఒమిక్రాన్ వేరియంట్ కంటే అత్యంత వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త వేరియంట్ కారణంగా ప్రమాదం పొంచి ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో తెలంగాణ వైద్యారోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. BF.7 వేరియంట్ వల్ల ఇబ్బందికర పరిస్థితులు మరోసారి నెలకొనే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కోవిడ్ కేసులు పెరిగితే ఎలా వ్యవహరించాలి, ఏం చర్యలు తీసుకోవాలనే విషయాలను చర్చించారు.

రాబోయే మూడు వారాలు క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి సీజన్ కావడంతో కోవిడ్ విస్తరించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో మంత్రి సూచించారు. కరోనా పట్ల ఎవరూ ఆందోళన చెందవద్దని, ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని హరీశ్ రావు సూచించారు. ఇప్పటికే పలు దేశాల్లో BF.7 వేరియంట్ వ్యాపిస్తున్న విషయాన్ని గమనిస్తున్నామని అన్నారు. దీనిపై వైద్యారోగ్య శాఖ అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ప్రజలందరూ బూస్టర్ డోసు వేయించుకోవాలని.. వ్యాక్సిన్ వల్ల పూర్తి రక్షణ లభిస్తుందని ఆయన చెప్పారు.

ఇప్పటికే కరోనా పలు దశలను తెలంగాణ ప్రభుత్వం సమర్ధవంతంగా ఎదుర్కున్నదని.. కరోనాను ఎదుర్కోవడంతో తెలంగాణ రాష్ట్రం అత్యుత్తమంగా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతానికి కరోనా వ్యాప్తి అంతగా లేకపోయినా.. ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అన్ని ఆసుపత్రుల్లో మందులు, ఆక్సిజన్, ఐసీయూ పడకలు సిద్ధంగా ఉంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వచ్చే వారికి తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్ అని తేలితే వెంటనే క్వారంటైన్‌కు పంపాలని చెప్పారు. కరోనా పాజిటివ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆసుపత్రికి పంపాలని సూచించారు.

దేశంలో BF.7 కేసులు నమోదవుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం రోజుకు పది కేసులు నమోదవుతున్నాయని, వాటిలో BF.7 కేసులు లేవన్నారు. ఎక్కువ కేసులు హైదరాబాద్‌లోనే నమోదు అవుతున్నందున జంట నగరాల ప్రజలు మాస్కులు తప్పకుండా ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఐఎంఏ సూచనలు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రజలకు పలు సూచనలు చేసింది.

- బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించండి.

- సబ్బు, నీళ్లు లేదా శానిటైజర్‌లతో తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి.

- భౌతిక దూరం పాటించాలి.

- పెళ్లిళ్లు, రాజకీయ సమావేశాలు లాంటి సామూహిక కార్యక్రమాలు నిర్వహించకూడదు.

- విదేశీ ప్రయాణాలు సాధ్యమైనంతగా మానుకోవాలి.

- జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, విరేచనాలు లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

- వీలైనంత త్వరగా బూస్టర్ డోస్‌ను తీసుకోవాలి.

First Published:  23 Dec 2022 4:22 AM GMT
Next Story