Telugu Global
Telangana

నుమాయిష్‌కు అనుమతి ఇవ్వొద్దు.. తెలంగాణ ప్రభుత్వానికి ఓ లాయర్ లేఖ

నుమాయిష్ నిర్వహించే ఎగ్జిబిషన్ సొసైటీ ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల నుంచి చట్టపరమైన అనుమతులు తీసుకోలేదని పిటిషనర్ ఖాజా ఇజాజుద్దీన్ తెలిపారు.

నుమాయిష్‌కు అనుమతి ఇవ్వొద్దు.. తెలంగాణ ప్రభుత్వానికి ఓ లాయర్ లేఖ
X

ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ షెడ్యూల్ ప్రకారం జనవరి 1 నుంచి ప్రారంభం కావాలి. నాంపల్లి ఎగ్జిబిషన్ లేదా నుమాయిషన్‌గా పేరు తెచ్చుకున్న ఈ భారీ కార్యక్రమం దాదాపు నెలన్నర పాటు జరుగుతుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించే ఈ నుమాయిష్‌లో దేశం నలుమూలల నుంచి తయారీదారులు, వర్తకులు వచ్చి స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. జంటనగరాలకు చెందిన వారే కాకుండా.. తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. అయితే వచ్చే ఏడాది ప్రారంభం కానున్న నుమాయిష్‌కు అనుమతి ఇవ్వొద్దని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టుకు చెందిన ఓ లాయర్ లేఖ రాశారు.

నుమాయిష్ నిర్వహించే ఎగ్జిబిషన్ సొసైటీ ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల నుంచి చట్టపరమైన అనుమతులు తీసుకోలేదని పిటిషనర్ ఖాజా ఇజాజుద్దీన్ తెలిపారు. ఎగ్జిబిషన్‌లో ఎలా ఏర్పాటు చేయాలనే అనుమతి జీహెచ్ఎంసీ ఇవ్వాలని, అలాగే డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఫైర్ సర్వీసెస్, హైదరాబాద్ సిటీ పోలీసుల అనుమతులు కూడా లేవని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పలు శాఖలు తప్పకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇవ్వాలని, ముఖ్యంగా తెలంగాణ ఫైర్ సర్వీసెస్ యాక్ట్ 1999 ప్రకారం అగ్నిమాపక శాఖ అనుమతి తీసుకోవాలని లేఖలో తెలిపారు.

1955 జీహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం లేఅవుట్ మ్యాప్ తప్పకుండా అప్రూవ్ చేయాలని లేఖలో తెలిపారు. ఇలాంటి చట్టపరమైన అనుమతులు లేకుండా ఎగ్జిబిషన్ సొసైటీ నుమాయిష్ 2023 ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. ఈ ఏడాది జనవరిలో సదరు లాయర్ సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. తాను తెలంగాణ హైకోర్టులో వేసిన పిల్‌ను అనుసరించి వెంటనే ఆర్డర్ పాస్ చేసేలా ఆదేశించాలని కోరారు.అయితే ఈ ఏడాది అగస్టులో జస్టిస్ (ప్రస్తుతం సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ పరిడివాలాతో కూడిన ధర్మాసనం పిటిషన్ కొట్టేసింది. తెలంగాణ హైకోర్టులోనే పిల్‌ను దాఖలు చేయాలని ఆదేశించింది.

దీంతో ఈ ఏడాది నవంబర్‌లో సదరు లాయర్ తాజాగా మరో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు చీఫ్ జస్టిస్.. పలు ప్రభుత్వ శాఖలకు నోటీసులు జారీ చేశారు. అయితే ఏ ప్రభుత్వ శాఖ కూడా ఇంత వరకు దీనిపై స్పందించలేదు కాబట్టి.. నుమాయిష్‌కు అనుమతులు ఇవ్వొద్దని ఆయన మరోసారి లేఖ రాసినట్లు తెలిపారు.

First Published:  19 Dec 2022 2:49 AM GMT
Next Story