Telugu Global
Telangana

బీజేపీ, బెంగాల్ మోడల్ ను తెలంగాణలో అమలు చేయదల్చుకుందా ?

మతకలహాలు రెచ్చగొట్టి ఓట్లను పోలరైజ్ చేసే విధానాన్ని బీజేపీ అనుసరిస్తున్నదా ? బెంగాల్ లో ఇదే వ్యూహాన్ని అనుసరించి ఓట్ల శాతాన్ని పెంచుకున్న బీజేపీ తెలంగాణలో కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.

బీజేపీ, బెంగాల్ మోడల్ ను తెలంగాణలో అమలు చేయదల్చుకుందా ?
X


బెంగాల్ ఎన్నికలప్పుడు అక్కడ బీజేపీ ప్రయోగించిన వ్యూహాన్ని ఇప్పుడు తెలంగాణలో ప్రయోగిస్తున్నదా ? అక్కడ ఎన్నికల్లో విఫలమైనప్పటికీ ఓట్ల శాతం, సీట్లు పెర‌గడానికి ఆ వ్యూహమే కారణమయ్యింద‌ని ఆ పార్టీ భావిస్తోందా ? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అవుననే సమాధానం వస్తుంది.

ఈ మధ్యకాలంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యవహరిస్తున్న తీరు, మాట్లాడుతున్న మాటలు, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రెచ్చగొడుతున్న మత కలహాలు చూస్తూ ఉంటే బెంగాల్ మాదిరిగానే ఇక్కడ వ్యూహం పన్నారని రాజకియ విశ్లేషకులు భావిస్తున్నారు.

గోషామహల్ శాసనసభ్యుడు టి రాజా సింగ్, ద్వేషం, భావోద్వేగాలు రెచ్చగొట్టడం, వివాదాలు పెంచిపోషించడం...ఇదంతా బీజేపీ వ్యూహంలో ఓ భాగమనేవాళ్ళు లేకపోలేదు.

ఇప్పుడు పార్టీ నుండి సస్పెండ్ అయిన రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రారంభించిన పాదయాత్ర, ఆ సందర్భంగా చేస్తున్న రచ్చ, రెచ్చగొట్టే ప్రసంగాలు పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బిజెపి కేంద్ర నాయకత్వం ప్రయోగించిన‌ వ్యూహాన్ని పోలి ఉన్నాయి.

వివాదాలు సృష్టిస్తూ, ఇబ్బందులకు గురిచేస్తూ, మతతత్వ భావాలను రెచ్చగొడుతూ వాటి ఆధారంగా ఓటర్లను పోలరైజ్ చేయడానికి బిజెపి ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యూహాన్ని పశ్చిమ బెంగాల్‌లో ప్రయోగించారని, తెలంగాణలో ఇటీవలి పరిణామాలు బీజేపీ ఇక్కడ కూడా పునరావృతం చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేస్తున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు.

మతపరమైన మంటలను రేకెత్తించడానికి, వ్యాప్తి చేయడానికి బిజెపి సోషల్ మీడియాపై ఎక్కువగా ఆధారపడుతుంది. రాజా సింగ్ ఎపిసోడ్ బిజెపి ప్రణాళికను ఆ పార్టీ సోషల్ మీడియా వింగ్ ప్రచారంలో పెట్టింది. సంజయ్ అరెస్టును కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేయడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్శించడానికి, ఒక వర్గాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది.

రాజా సింగ్ మతపరమైన విషాన్ని చిమ్మడంలో దిట్ట అని తెలంగాణలోనే కాదు దేశంలో అందరికీ తెలుసు. అయితే నూపుర్ శర్మ ఎపిసోడ్ తరువాత చెలరేగిన ఆగ్రహం నేపథ్యంలో, బిజెపి కేంద్ర నాయకత్వం అటువంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలను కోరింది. అయితే రాజా సింగ్ తనంతట తానుగా హద్దులు దాటాడా అనే ప్రశ్న వచ్చినప్పటికీ ఈ ఎపిసోడ్ మొత్తం ఎన్నికల సమయంలో భావోద్వేగాలను రెచ్చగొట్టే బీజేపీ వ్యూహంలో భాగమే అనే మాటా వినపడుతోంది. తనను పార్టీ దూరం చేసుకోబోదని రాజాసింగ్ ధీమా గా చెప్పిన మాటలు కూడా దీన్ని రుజువు చేస్తున్నది

రాజా సింగ్, సంజయ్‌ల చర్యలు తెలంగాణలో మతపరమైన ఉద్రిక్తతను పెంచడం ద్వారా ఓట్లను పోలరైజ్ చేయడమే లక్ష్యంగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అలా చేయడం ద్వారా, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్‌లో జరిగినట్లుగా శాంతి భద్రతలు విఫలం చెందాయని బిజెపి రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపాలని భావిస్తోంది. తద్వారా ఎన్నికల సమయానికి కేంద్ర పోలీసు బలగాలను రంగంలోకి దింపాలని ఆ పార్టీ ప్లాన్.

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆ పార్టీ మూడు అంచెలపై దృష్టి సారిస్తోంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొదటిది, నాయకులను, ప్రజల‌ను రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం, రెండు, బిజెపి నాయకులపై పోలీసులు చట్ట వ్యతిరేకంగా , క్రూరంగా ప్రవర్తిస్తున్నారనే ప్రచారం చేయడం, పోలీసులపై దాడిని ఎక్కుపెట్టడం, ఆపై సోషల్ మీడియాలో తన ప్రత్యర్థుల పై బలంగా దాడులు చేయడం.

రాజా సింగ్ అరెస్టు తర్వాత జనగామ‌లో సంజయ్‌ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్న తర్వాత, బీజేపీ సోషల్ మీడియాలో తన ప్రచారాన్ని తీవ్రతరం చేసింది. రాజాసింగ్ ను బీజేపీ సస్పెండ్ చేసినప్పటికీ ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం రాజాసింగ్ కు మద్దతుగా సోషల్ మీడియాలో విస్త్రుత ప్రచారం చేశారు. కొన్ని హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేయడం ద్వారా దేశం దృష్టిని ఆకర్శించడానికిప్రయత్నించారు. సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థులను రెచ్చగొట్టేప్రయత్నం చేశారు.

అక్కడితో ఆగలేదు రాజా సింగ్ బెయిల్ పై విడుదలయ్యాక సంబరాలు చేసుకున్నారు. ఊరేగింపులు తీశారు. ఆ సమయంలో కూడా ఇతర వర్గాలను రెచ్చగొట్టే నినాదాలు చేశారు.

ఇక మత ఆధారంగా ఓటర్లను పోలరైజ్ చేయడానికి బీజేపీ ఎంఐఎం పార్టీని బూచిగా చూపిస్తోంది. కేసీఆర్ ఎంఐఎం కు స్నేహితుడని , హిందూ వ్యతిరేకి అని ప్రచారం లంకించుకుంది. పశ్చిమ బెంగాల్ మాదిరిగా కాకుండా, ఎంఐఎంకు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఓటర్ల మద్దతు ఉంది, ఆ పార్టీకి రాష్ట్రంలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ, ఎక్కువ సంఖ్యలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ లున్నారు. ఇప్పుడు ఎమ్ ఐ ఎమ్ భుజాల మీద తుపాకీ పెట్టి టీఆరెస్ ను కాల్చాలన్న ప్లాన్ బీజేపీది. వచ్చే ఎన్నికల్లో ఓట్లను పోలరైజ్ చేయడంలో,మైలేజీని పొందడంలో కూడా బీజేపీ ఇదే ప్లాన్ ను అనుసరించనుంది. ఇదంతా మోడీ, అమిత్ షాల కనుసన్నలలోనే జరుగుతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.

First Published:  26 Aug 2022 3:30 AM GMT
Next Story