Telugu Global
Telangana

మీకు 3 గంటల కరెంట్ కావాలా.. 24 గంటల కరెంట్ కావాలా? : సీఎం కేసీఆర్

ఉద్యమ సమయంలో పాలమూరు జిల్లాలోని ఏ మూలకు పోయినా, ఏ ప్రాంతానికి వెళ్లినా నా మనసు దుఖంతో నిండిపోయేది.

మీకు 3 గంటల కరెంట్ కావాలా.. 24 గంటల కరెంట్ కావాలా? : సీఎం కేసీఆర్
X

దేశంలో వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం మాదే. ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి రైతుల పరిస్థితి ఏంటో తెలుస్తుంది. ఇవ్వాళ కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. పక్కన ఉన్న కర్ణాటకలో వాళ్లు ఏ పాటి కరెంట్ ఇస్తున్నారో అందరికీ తెలుసని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ వస్తే రైతులు గోస పడక తప్పదని హెచ్చరించారు. మీకు 3 గంటల కరెంట్ కావాలా.. లేదంటే 24 గంటల కరెంట్ కావాలో తేల్చుకోవాలని సూచించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని, మాట్లాడారు.

ఉద్యమ సమయంలో పాలమూరు జిల్లాలోని ఏ మూలకు పోయినా, ఏ ప్రాంతానికి వెళ్లినా నా మనసు దుఖంతో నిండిపోయేది. నా కళ్లల్లో నీళ్లు వచ్చేవి. అందుకే మహబూబ్‌నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆనాడు ప్రొఫెసర్ జయశంకర్ చెప్పారు. అందుకే ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేశాను. ఆ ఎన్నికల సమయంలో డాక్టర్ లక్ష్మారెడ్డి ముందుండి, తన భుజాల మీద భారం వేసుకొని నన్ను ఎంపీగా గెలిపించారని సీఎం కేసీఆర్ అన్నారు.

నేను తెలంగాణ కోసం చాలా ఏండ్లు పోరాటం చేసినప్పటికీ.. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉంటూనే రాష్ట్రాన్ని సాధించిన విషయం ఎప్పటికీ చరిత్రలో నిలిచి ఉంటుందని అన్నారు. అప్పట్లో మనుషులే కాదు.. చెట్లు కూడా బక్కగా ఉండేవి. పాలమూరు గోస చూసి ఎంతో బాధపడ్డాము. కానీ ఇవ్వాళ పాలమూరులో వలసలు ఆగిపోయి.. వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడకు రైతు కూలీలు వచ్చే పరిస్థితి నెలకొన్నదని కేసీఆర్ చెప్పారు.

ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష్మారెడ్డి మంత్రి అయ్యారు. ఎన్నో పనులు ఇక్కడ చేపట్టారు. ఇవాళ రాష్ట్రంలో అనేక డయాగ్నస్టిక్ సెంటర్లు ఉన్నాయంటే అది లక్ష్మారెడ్డి పుణ్యమే అని కేసీఆర్ చెప్పారు. మరోసారి లక్ష్మారెడ్డిని జడ్చర్ల నుంచి గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.

First Published:  18 Oct 2023 11:55 AM GMT
Next Story