Telugu Global
Telangana

బీజేపీ టికెట్ల కోసం 6,003 దరఖాస్తుల వెనుక అసలు మతలబు ఏంటో తెలుసా?

బీజేపీకి అభ్యర్థులే లేరని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారం చేస్తుండగా.. ఇంత భారీగా దరఖాస్తులు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

బీజేపీ టికెట్ల కోసం 6,003 దరఖాస్తుల వెనుక అసలు మతలబు ఏంటో తెలుసా?
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులకే ప్రాధాన్యత ఇస్తూ బీఆర్ఎస్ టికెట్లు ప్రకటించింది. ఇక కాంగ్రెస్ పార్టీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని నిబంధన పెట్టింది. పైగా ఒక్కో దరఖాస్తుకు రూ.50 వేలు ఫీజు కూడా పెట్టింది. అయితే కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు ఆహ్వానించడంపై ఎద్దేవా చేసిన తెలంగాణ బీజేపీ.. చివరకు అదే బాట పట్టింది. కాంగ్రెస్ ఫీజు పెడితే.. బీజేపీ మాత్రం ఫ్రీ అని చెప్పింది.

సెప్టెంబర్ 4 నుంచి 10 (ఆదివారం) వరకు బీజేపీ దరఖాస్తులు స్వీకరించగా.. 6,003 మంది అప్లయ్ చేసుకున్నారు. బీజేపీకి అభ్యర్థులే లేరని బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రచారం చేస్తుండగా.. ఇంత భారీగా దరఖాస్తులు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. శనివారం 1,602 మంది, ఆదివారం 2,724 మంది టికెట్ల కోసం అప్లికేషన్లు పెట్టారు. ఇంత మంది టికెట్ల కోసం దరఖాస్తు చేయడం వెనుక ఒక మతలబు ఉన్నది.

ఉచితంగానే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉండటంతో బూత్ లెవెల్ కార్యకర్తలు, ఆయా జిల్లా, మండల బీజేపీ కార్యాలయ సిబ్బంది కూడా టికెట్ల కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తున్నది. ఏమో గుర్రం ఎగరా వచ్చు.. టికెట్ వస్తే పార్టీనే ఫండ్ ఇస్తుంది కదా.. కనీసం గెలవక పోయినా ఎమ్మెల్యే అభ్యర్థి అనే పేరైనా తెచ్చుకోవచ్చనే ఉద్దేశంతోనే క్షేత్ర స్థాయి కార్యకర్తలు క్యూ కట్టినట్లు తెలుస్తున్నది. వచ్చిన దరఖాస్తుల్లో 90 శాతం ఇలాంటి వారే ఉన్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

గజ్వేల్‌కు చెందిన ఒక బూత్ లెవెల్ కార్యకర్త కూడా టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఆ బీజేపీ కార్యకర్త తనకు టికెట్ వస్తే ఏకంగా సీఎం కేసీఆర్‌పై పోటీ చేసినట్లు అవుతుందని సంబర పడుతున్నాడు. 'చాయ్ వాలా' బీజేపీ తరపున గెలిచి దేశ ప్రధాని అయినప్పుడు.. మేం మాత్రం ఎందుకు కాలేమని ఆయా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సీనియర్ నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీలు మాత్రం దరఖాస్తుకు దూరంగా ఉన్నారు.

సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దుబ్బాక నుంచి రఘునందన్ రావు తప్ప ఎవరూ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా అసెంబ్లీ టికెట్లకు దూరంగానే ఉన్నారు. ఎంపీలందరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీగా ఉండాలని బీజేపీ ఇప్పటికే సూచించినట్లు వార్తలు వచ్చాయి. కానీ బీజేపీకి ఉన్న నలుగురు ఎంపీలు అసలు దరఖాస్తు ముచ్చటే తెలియనట్లు ఉన్నారు.

గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఆయనకు దరఖాస్తు చేసుకునే వీలే లేకుండా పోయింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కూడా టికెట్ కోసం దరఖాస్తు చేయలేదు. అయితే ఈటల భార్య జమున మాత్రం గజ్వేల్ టికెట్ కోసం దరఖాస్తు చేశారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ అయితే తనను పోటీ చేయమని అధిష్టానం ఏమీ చెప్పలేదని అంటున్నారు.

బీజేపీ తరపున పోటీ చేయడానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లు ఇంద్రసేనారెడ్డి, బాబూ మోహన్ వంటి ప్రముఖులతో పాటు కొంత మంది ఎన్ఆర్ఐలు బీజేపీ తరపున పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. మొత్తానికి ప్రత్యర్థి పార్టీలు ఆరోపించినట్లు బీజేపీకి రాష్ట్రంలో బరిలోకి దిగడానికి అభ్యర్థులే లేరన్న ఆరోపణలు నిజమే అని అర్థం అవుతోంది.

First Published:  11 Sep 2023 3:02 AM GMT
Next Story