Telugu Global
Telangana

ఓటర్ల జాబితా తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు : ఎలక్షన్ కమిషన్

ఓటర్ల జాబితాల తయారీలో ఎలాంటి నిర్లక్ష్యం తగదని, నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే ఏ స్థాయి అధికారిపై అయినా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ హెచ్చ‌రించారు.

ఓటర్ల జాబితా తయారీలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు : ఎలక్షన్ కమిషన్
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియలో ఎలక్షన్ కమిషన్ వేగం పెంచింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాను రూపొందించే పనిలో అధికారులు ఉన్నారు. మరోవైపు ఈవీఎం యంత్రాల తనిఖీలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం రాష్ట్రంలో పర్యటనకు వచ్చింది. ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించింది. ఈ క్రమంలో శుక్రవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సంఘం బృందం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించింది.

ఓటర్ల జాబితాల తయారీలో ఎలాంటి నిర్లక్ష్యం తగదని, నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే ఏ స్థాయి అధికారిపై అయినా కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ హెచ్చ‌రించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సంబంధించి సమీక్ష చేస్తున్నారు. ఇప్పటి వరకు 24 జిల్లాలు పూర్తి కాగా.. శనివారం మిగిలిన జిల్లాకు సంబంధించిన సమీక్ష చేస్తారు. ఓటరు జాబితా రూపకల్పనలో క్షేత్రస్థాయి పరిశీలన, బోగస్ ఓట్ల తొలిగింపు, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించే చర్యలు పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు.

మరోవైపు తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్ కూడా అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్, క్రెడాయ్, ట్రెడా, ఫిక్కీ, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ కౌన్సిల్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఆయా సంస్థల పరిధిలో ప్రతీసారి తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్నదని.. ఉద్యోగుల్లో ఓటు ప్రాధాన్యతపై అవగాహన పెంచడానికి సహకారం అందించాలని కోరారు. ఇప్పటికే హైదరాబాద్‌లోని సూపర్ మార్కెట్లలో ఎలక్షన్ కమిషన్ వారి పేపర్ బ్యాగ్‌లు ఉంచారు. దీనిపై ఓటు నమోదు, అడ్రస్ మార్పిడి, ఇతర అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం ఉంటుందని తెలిపారు. ఈ సారి హైదరాబాద్ పరిధిలో ఓటింగ్ శాతం పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

First Published:  24 Jun 2023 3:07 AM GMT
Next Story