Telugu Global
Telangana

దశాబ్ది ఉత్సవాల్లో గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

KCR Nutrition Kit: కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్సవాల్లో ఒక రోజు ఈ కిట్లు అన్ని జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

దశాబ్ది ఉత్సవాల్లో గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ
X

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 2 నుంచి గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. గర్భిణీ స్త్రీ పోశకాహార స్థితిని మెరుగుపరిచే లక్ష్యంతో ఈ కిట్లను పంపిణీ చేయాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలు జరుగనున్నాయి. ఇందులో ఒక రోజును ప్రత్యేకంగా ఆరోగ్యం, వైద్యం, కుటుంబ సంక్షేమం కోసం అంకితం చేయనున్నారు. ఆ సందర్భంగా కిట్లు పంపిణీ జరుగనున్నది.

ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్లు, కార్పోహైడ్రేట్లు, ఇతర సూక్ష్మ పోషకాలతో కూడిన సప్లిమెంట్ల ప్యాకెట్లు ఈ కిట్స్‌లో ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6.8 లక్షల మంది గర్భిణీ స్త్రీలకు ఈ కిట్లను అందజేయనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉత్సవాల్లో ఒక రోజు ఈ కిట్లు అన్ని జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ..

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గొల్ల కురుమలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభవార్త చెప్పారు. త్వరలోనే రెండవ విడత గొర్రెల పంపిణీ మొదలవుతుందని అన్నారు. జూన్ 5వ తేదీ నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమం నల్గొండ జిల్లాలో మొదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జూన్ 5న అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు గొర్రెలను పంపిణీ చేస్తారని చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, పశుసంవర్థక శాఖ అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

ఇక జూన్ 7న మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ జరుగనున్నది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై కూడా మంత్రి సమీక్ష చేశారు. చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌కు సూచించారు.

Next Story