Telugu Global
Telangana

నేటి నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ.. ఇవాళ వైద్యారోగ్య దినోత్సవం

గర్భిణుల్లో పోషకార లోపం, రక్తహీనత లేకుండా కాపాడేందుకు కేసీఆర్ కిట్లకు అనుబంధంగా ఈ న్యూట్రిషన్ కిట్లను అందించనున్నారు.

నేటి నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ.. ఇవాళ వైద్యారోగ్య దినోత్సవం
X

తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేయనున్నది. మాతాశిశు సంరక్షణ కోసం, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో న్యూట్రిషన్ కిట్లు అందించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈ రోజు ప్రజారోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో ఈ రోజే రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్ల పంపిణీ ప్రారంభం అవుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు.

గర్భిణుల్లో పోషకార లోపం, రక్తహీనత లేకుండా కాపాడేందుకు కేసీఆర్ కిట్లకు అనుబంధంగా ఈ న్యూట్రిషన్ కిట్లను అందించనున్నారు. కేసీఆర్ కిట్లు ప్రసవానంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించనుండగా.. న్యూట్రిషన్ కిట్లను ముందుగానే గుర్తించిన గర్భిణులకు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాన్ని పైలెట్ ప్రాజెక్టుగా నిరుడు డిసెంబర్‌లో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కుమ్రం భీం, ఆసిఫాబాద్, ములుగు, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల్లో ప్రారంభించారు. అక్కడ న్యూట్రిషన్ కిట్ల వల్ల సత్ఫలితాలు వస్తున్నట్లు గుర్తించిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లో కిట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది.

బిడ్డ కడుపులో ఉన్న సమయంలోనే న్యూట్రిషన్ కిట్లను అందించడం వల్ల మాతా శిశువులకు లబ్ది చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కిట్‌లో మొత్తం 8 రకాల వస్తువులను అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6.8 లక్షల మంది గర్భిణులకు ఈ రోజు నుంచి కిట్ల పంపిణీ జరుగుతున్నది. ఇప్పటికే న్యూట్రిషన్ కిట్ల కోసం ప్రభుత్వం రూ.250 కోట్ల బడ్జెట్ కేటాయించింది.

న్యూట్రిషన్ కిట్లలో ఒక కిలో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కిలో కర్జూరం, 3 ఐరన్ సిరప్ బాటిల్స్, అరకిలో నెయ్యి, 200 గ్రాముల పల్లి చిక్కీ, ఒక కప్పు, ప్లాస్టిక్ బాటిల్ ఉంటాయి.

నేడు వైద్యారోగ్య దినోత్సవం..

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తి చేసుకొని 10వ ఏట అడుగు పెట్టిన సందర్భంలో ప్రభుత్వం 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈ రోజు వైద్యారోగ్య దినోత్సవాన్ని జరుపనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ మార్గ నిర్దేశంలో వైద్యారోగ్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. హెల్త్ సెక్టార్‌లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానానికి ఎదిగిందని మంత్రి చెప్పారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకునే దిశగా వేగవంతంగా అడుగులు వేస్తున్నామని మంత్రి చెప్పారు. ఆరోగ్య తెలంగాణ ఆశయం నెరెవేరే దశకు చేరుకున్నామని చెప్పారు.

పల్లె దవాఖాన, బస్తీ దవాఖానలతో ప్రజలకు అడుగు దూరంలోనే వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు. తల్లిబిడ్డల సంక్షేమం కోసం మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, 57 రకాల ఉచిత పరీక్షలు అందించే తెలంగాణ డయాగ్నస్టిక్స్, 102 డయాలిసిస్ సెంటర్లు, ప్రతీ పడకకు ఆక్సిజన్ సౌకర్యం వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు, బిడ్డ పుట్టగానే కేసీఆర్ కిట్, తల్లి బిడ్డను ఇంటికి చేర్చడానికి అమ్మ ఒడి వాహనాలు, ఆరోగ్య మహిళ, కంటి వెలుగు, సీపీఆర్ ట్రైనింగ్ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.


First Published:  14 Jun 2023 2:18 AM GMT
Next Story