Telugu Global
Telangana

బీఆర్ఎస్ వ‌ద్ద‌నుకున్న లీడ‌ర్లంద‌ర్నీ నెత్తికెత్తుకుంటున్నామా.. కాంగ్రెస్ శ్రేణుల అంత‌ర్మ‌థ‌నం

తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఖ‌మ్మం జిల్లాలో బ‌ల‌మైన నేత‌. అయితే గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి చేతిలో ఓడిపోయారు. గెలిచిన ఉపేంద‌ర్‌రెడ్డి త‌ర్వాత బీఆర్ఎస్‌లో చేరారు.

బీఆర్ఎస్ వ‌ద్ద‌నుకున్న లీడ‌ర్లంద‌ర్నీ నెత్తికెత్తుకుంటున్నామా.. కాంగ్రెస్ శ్రేణుల అంత‌ర్మ‌థ‌నం
X

బీఆర్ఎస్ వ‌ద్ద‌నుకున్న లీడ‌ర్లంద‌ర్నీ నెత్తికెత్తుకుంటున్నామా.. కాంగ్రెస్ శ్రేణుల అంత‌ర్మ‌థ‌నం

తెలంగాణలో అధికారంలోకి రావాల‌ని క‌ల‌లుగంటున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు త‌మ పార్టీ అగ్ర‌నేతల తీరుతో తీవ్ర అయోమ‌యానికి లోన‌వుతున్నారు. తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, మైనంప‌ల్లి హ‌న్మంత‌రావు లాంటి నేత‌ల చేరిక‌ల‌తో టీపీసీసీ నేత‌లంతా జోష్‌లో ఉంటే.. వాళ్లంద‌రినీ బీఆర్ఎస్ వ‌ద్ద‌నుకుంటే మ‌నం నెత్తికెత్తుకుంటున్నామా అని కాంగ్రెస్ క్యాడ‌ర్ కంగారుప‌డుతోంది. అధికార పార్టీ వ్యూహాత్మ‌కంగా వ‌దిలించుకుంటున్న నేత‌లంద‌రినీ పార్టీలోకి తెచ్చుకోవ‌డం స‌రైందేనా అన్న అయోమ‌యం ఇప్పుడు వారిలో నెల‌కొంది.

ఖ‌మ్మంలో తుమ్మ‌ల గెలుస్తారా?

తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఖ‌మ్మం జిల్లాలో బ‌ల‌మైన నేత‌. అయితే గ‌త ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి చేతిలో ఓడిపోయారు. గెలిచిన ఉపేంద‌ర్‌రెడ్డి త‌ర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. ఆయ‌న‌కే కేసీఆర్ టికెట్ ఇచ్చారు. అంటే అక్క‌డ తుమ్మ‌ల గెల‌వ‌లేర‌ని బీఆర్ఎస్ ఫిక్స‌యిపోయిందా? అదే నిజ‌మైతే ఆయ‌న్ను పార్టీలో చేర్చుకుని మన‌కేంటి ఉప‌యోగం అనేది స‌గ‌టు కాంగ్రెస్ శ్రేణుల ప్ర‌శ్న‌. తుమ్మ‌ల త‌న రాజ‌కీయ అనుభ‌వం ఉప‌యోగించుకుని గెలిచినా దశాబ్దాలుగా కాంగ్రెస్ వ్య‌తిరేక భావ‌న‌లతో ఉన్న ఆయ‌న ఈ పార్టీలో ఎంత‌వ‌ర‌కు ఇముడుతార‌నేది వారి అనుమానం.

మోత్కుప‌ల్లికి సీటిస్తారా?

మ‌రోవైపు న‌ల్గొండ జిల్లాలో మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు కాంగ్రెస్‌లో చేర‌డానికి రంగం సిద్ధ‌మైంది. కొంత‌కాలంగా ఆయ‌న్నూబీఆర్ఎస్ వ్యూహాత్మ‌కంగా ప‌క్క‌న పెట్టేసింది. ఇప్పుడాయ‌న‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవాల‌ని రెడీ అయ్యారు. తుంగ‌తుర్తి, ఆలేరుల నుంచి ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుప‌ల్లి ఎన్నో ఆశ‌ల‌తో బీఆర్ఎస్‌లో చేరారు. కానీ ఆయ‌న‌కు కారు పార్టీ ఏ ప‌ద‌వీ ఇవ్వ‌లేదు. అంటే ఆయ‌న వ‌ల్ల పార్టీకి పెద్ద ఉప‌యోగం లేద‌ని కేసీఆర్ భావించి ఉంటార‌ని, అందుకే క‌నీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వ‌లేద‌ని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. ఆయ‌న్ను తెచ్చి ఇప్పుడు టికెట్ క‌ట్ట‌బెడ‌తారా అనేది వారి ప్ర‌శ్న.

మైనంపల్లి విష‌యంలోనూ అదే ప‌రిస్థితి

మ‌రోవైపు త‌న కొడుక్కి మెద‌క్ టికెట్ ఇవ్వ‌లేద‌ని అలిగి బీఆర్ఎస్‌తో తెగ‌తెంపులు చేసుకుని కాంగ్రెస్‌లో చేరిన మైనంప‌ల్లి త‌న‌కు త‌న కుమారుడికీ రెండు టికెట్లు అడుగుతున్నారు. ఇద్ద‌రికీ ఇస్తారా? ఇస్తే ఇద్ద‌రూ గెలుస్తారా? నిజంగా ఇద్ద‌రూ గెలిచే వాతావ‌ర‌ణం ఉంటే ఎప్ప‌టి నుంచో ఆ నియోజ‌క‌వ‌ర్గాల‌ను అంటిపెట్టుకుని ఉన్న నాయ‌కుల‌కే ఇస్తే మంచిది క‌దా అని కాంగ్రెస్ క్యాడ‌ర్ భావ‌న‌.

First Published:  30 Sep 2023 5:57 AM GMT
Next Story