Telugu Global
Telangana

స్టాండింగ్ కమిటీల్లో టీఆర్ఎస్‌పై వివక్ష..

ఇప్పటివరకు పరిశ్రమల శాఖ కమిటీ చైర్మన్‌గా ఉన్న కేశవరావు ఇకపై ఆ కమిటీలో కేవలం సభ్యుడిగా కొనసాగుతారు. నామా నాగేశ్వర్ రావు లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా ఇప్పటి వరకూ బాధ్యతలు నిర్వహించారు. ఇకపై ఆయన ఆర్థిక శాఖ కమిటీలో సభ్యుడిగా ఉంటారు.

స్టాండింగ్ కమిటీల్లో టీఆర్ఎస్‌పై వివక్ష..
X

కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేసిన తర్వాత టీఆర్ఎస్‌పై కేంద్రం అక్కసు మామూలుగా లేదు. ఆర్థిక సాయం అందించకపోవడం అటుంచితే, ఇచ్చిన అవార్డుల్ని కూడా ఇవ్వలేదని అబద్ధాలు చెప్పడం ఇటీవలే చూశాం. తాజాగా ఆ అక్కసు ఏ స్థాయిలో ఉందో మరోసారి బయటపడింది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీల్లో టీఆర్ఎస్ ఎంపీలకు అధ్యక్ష పదవులు తొలగించారు. కేవలం సభ్యులుగానే వారిని పరిమితం చేశారు.

పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీల్లో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం మరోసారి కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించిందని తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌కు 16 మంది ఎంపీలున్నా కనీసం ఒక్క పార్లమెంటరీ కమిటీకి ఒకరిని కూడా చైర్మన్‌గా నియమించలేదు. పోనీ గతంలో కూడా ఇదే ఆనవాయితీ ఉందా అంటే అదీ లేదు. గతంలో ఇద్దరికి చైర్మన్లుగా అవకాశం ఇచ్చారు. కానీ టీఆర్ఎస్.. బీఆర్ఎస్‌గా మారడం, కేంద్రాన్ని ఢీకొట్టేందుకు సమాయత్తం కావడంతో కక్ష మరింత పెరిగింది. అందుకే స్టాండింగ్ కమిటీల చైర్మన్లుగా టీఆర్ఎస్ ఎంపీలను తొలగించారు.

ఇప్పటివరకు పరిశ్రమల శాఖ కమిటీ చైర్మన్‌గా ఉన్న కేశవరావు ఇకపై ఆ కమిటీలో కేవలం సభ్యుడిగా కొనసాగుతారు. నామా నాగేశ్వర్ రావు లైబ్రరీ కమిటీ చైర్మన్‌గా ఇప్పటి వరకూ బాధ్యతలు నిర్వహించారు. ఇకపై ఆయన ఆర్థిక శాఖ కమిటీలో సభ్యుడిగా ఉంటారు. మిగతావారిని కూడా కేవలం కమిటీల్లో సభ్యులుగా ఉంచారు. ఈ చైర్మన్ పదవులతో తెలంగాణకు ఏదో వచ్చేస్తుందని కాదు కానీ, కనీసం ఆ పాటి గౌరవం కూడా ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపడం మాత్రం దారుణం. 16 మంది ఎంపీలున్న ఓ ప్రాంతీయ పార్టీకి పార్లమెంట్‌లో ఏ స్థానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ పొగరు తగ్గాలి, ఈ అహంకార ధోరణి ఆగిపోవాలి. అందుకే బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లోకి వస్తోంది. మోదీ నిరంకుశత్వాన్ని దించడంలో తన వంతు పాత్ర పోషించబోతోంది.

First Published:  6 Oct 2022 3:08 PM GMT
Next Story