Telugu Global
Telangana

నామినేషన్ రోజే నమ్మకం పోయింది.. రాజగోపాల్ రెడ్డిలో నైరాశ్యం..

రాజగోపాల్ రెడ్డి నామినేషన్ రోజు కార్యకర్తల్లో ఉత్సాహం లేదు. రాజగోపాల్ రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌లు కొట్టేశారనే విషయం జనంలోకి బలంగా వెళ్లడంతో.. ఆయనకు నైతిక మద్దతు కూడా కరవైంది.

నామినేషన్ రోజే నమ్మకం పోయింది.. రాజగోపాల్ రెడ్డిలో నైరాశ్యం..
X

మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసిన అనంతరం పెద్ద పెద్ద సవాళ్లు విసిరారు. మునుగోడులో తనపై పోటీ చేసేందుకు కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా రావొచ్చన్నారు. ఎవరొచ్చినా ఓడించడానికి తాను రెడీ అన్నారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే తనకు పబ్లిసిటీ వస్తుందని భావించిన ఆయన మునుగోడు ఉప ఎన్నికల్లో వారిద్దరూ పోటీ చేయాలంటూ వితండవాదం చేశారు.

నామినేషన్ రోజే పరువు పోయింది..

రాజగోపాల్ రెడ్డి చేరిక సభకు అమిత్ షా హాజరైనా జనం పెద్దగా రాలేదు. ఇప్పుడు నామినేషన్ రోజు కూడా రాజగోపాల్ రెడ్డికి పెద్దగా మందీ మార్బలం వెంట రాలేదు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ తరుణ్‌ చుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చినా.. కార్యకర్తల్లో ఉత్సాహం లేదు. రాజగోపాల్ రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌లు కొట్టేశారనే విషయం జనంలోకి బలంగా వెళ్లడంతో.. ఆయనకు నైతిక మద్దకు కూడా కరవైంది.

మునుగోడు రోడ్లు.. సిద్ధిపేట రోడ్లు..

మునుగోడు రోడ్లు చూడంటి, సిద్ధిపేట రోడ్లు చూడండి.. ఏవి బాగున్నాయో మీరే చెప్పండి అంటూ ప్రజల్ని కోరారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు రోడ్లు బాగున్నాయని రాజగోపాల్ రెడ్డి అంటే.. కచ్చితంగా ఆ క్రెడిట్ కేసీఆర్ ప్రభుత్వానిదే. ఎందుకంటే మునుగోడులో రోడ్లు వేసినా, సిద్ధిపేటలో వేసినా రాష్ట్ర ప్రభుత్వమే వేయాలి. అందులో స్థానిక ఎమ్మెల్యే ప్రతిభ ఏముంటుంది..? మునుగోడు రోడ్లు బాగున్నాయని రాజగోపాల్ రెడ్డి ఒప్పుకుంటే.. గతంలో ఆయన చేసిన ఆరోపణలు అసత్యాలు అని ఒప్పుకున్నట్టే లెక్క. తన నియోజకవర్గంపై ప్రభుత్వం వివక్ష చూపిస్తోందనే ఆరోపణలతోనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధపడ్డారు.

నల్గొండ జిల్లా అంటే విప్లవాల ఖిల్లా అంటున్న రాజగోపాల్ రెడ్డి, తనను దొంగ దెబ్బ తీసేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కానీ రాజగోపాల్ రెడ్డిని ఎవరూ దొంగ దెబ్బ తీయాల్సిన అవసరం లేదని సోషల్ మీడియాలో కౌంటర్లు పడుతున్నాయి. 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ విషయం బయటపెట్టుకుని, తన గొయ్యి తానే తవ్వుకున్నారని అంటున్నారు నెటిజన్లు.

First Published:  10 Oct 2022 9:55 AM GMT
Next Story