Telugu Global
Telangana

కాంగ్రెస్‌లో తుమ్మలకు మొదలైన అసమ్మతి.. పాలేరు నాయకుల సహాయ నిరాకరణ?

పాలేరు టికెట్ తుమ్మలకే దాదాపు కన్ఫార్మ్ అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో రాయల వర్గం ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంది.

కాంగ్రెస్‌లో తుమ్మలకు మొదలైన అసమ్మతి.. పాలేరు నాయకుల సహాయ నిరాకరణ?
X

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వరావు ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరారు. టీడీపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలలో మంత్రిగా ఒక హవా నడిపిన తుమ్మల.. చివరకు తను జీవితాంతం వ్యతిరేకించిన కాంగ్రెస్‌లోనే చేరడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఆశించి.. అది దక్కక పోవడంతో కాంగ్రెస్ పంచన చేరారు. రాబోయే ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేయడానికి గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఇప్పటికే కాంగ్రెస్‌లో ఉన్న నాయకులు, కార్యకర్తల నుంచి వ్యతిరేకత మొదలైంది.

ఈ సారి పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేయాలని భావించారు. అయితే తుమ్మల రాకతో పాలేరులో సమీకరణలు మారిపోయాయి. ఖమ్మం కంటే తాను పాలేరు నుంచి పోటీ చేయడానికి ఇష్టపడుతున్నట్లు చెప్పడంతో.. పొంగులేటి వేరే నియోజకవర్గానికి మారడానికి సిద్దమయ్యారు. అయితే పాలేరులో తుమ్మల పోటీకి కొంత మంది సీనియర్ నాయకులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తున్నది.

పీసీసీ నాయకులు, కొన్నేళ్లుగా పాలేరులో ముఖ్య కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న రాయల నాగేశ్వరరావు తుమ్మలపై ఇప్పుడు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పని చేస్తూ, నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ఇప్పుడు అకస్మాతుగా పార్టీలో చేరిన వారికి టికెట్లెలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచి బీఆర్ఎస్‌లో చేరిన తర్వాత.. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతానికి తానే కృషి చేశానని చెబుతున్నారు. పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డ రాయల, ఆయన అనుచర వర్గం తుమ్మలకు సహాయ నిరాకరణ చేస్తోంది.

సీపీఎంలో సీనియర్ నాయకుడిగా ఉన్న రాయల నాగేశ్వరరావు.. ఆ తర్వాత పార్టీని వీడి చిరంజీవి పెట్టిన పీఆర్పీలో జాయిన్ అయ్యారు. పలు కారణాలతో ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ సభ్యుడి హోదా వరకు ఆయన పరపతి పెరిగింది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో పాలేరు టికెట్ ఆశించి భంగపడ్డారు. కందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్లడంతో ఈ సారి టికెట్ తనకే వస్తుందని భావించారు. పొంగులేటి కాంగ్రెస్‌లో చేరినా.. ఖమ్మం లేదా కొత్తగూడెం నుంచి పోటీ చేస్తారని.. తాను పాలేరు నుంచే బరిలోకి దిగుతానని అనుచరులకు చెప్పుకుంటూ వచ్చారు.

తాజాగా పాలేరు టికెట్ తుమ్మలకే దాదాపు కన్ఫార్మ్ అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో రాయల వర్గం ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంది. అక్కడ రాయల భవిష్యత్ కార్యచరణపై చర్చించినట్లు తెలిసింది. అంతా కలిసి బీఆర్ఎస్‌లో జాయిన్ అవుదామనే చర్చ కూడా జరిగినట్లు తెలిసింది. కాంగ్రెస్‌లో ఉన్నా తుమ్మలకు మాత్రం మద్దతు ఇవ్వమని బహిరంగంగానే చెబుతున్నారు. పాలేరు నియోజకవర్గంలో కీలక నాయకుడు ఇప్పుడు తుమ్మలకు వ్యతిరేకంగా మాట్లాడుతుండటం చర్చనీయాంశంగా మారింది.

First Published:  20 Sep 2023 2:03 AM GMT
Next Story