Telugu Global
Telangana

సినిమా టికెట్ల ధరలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. ప్రేక్షకులు వస్తారా?

రూ. 300 పెడితే ఏదో ఒక ఓటీటీని నెల, రెండు నెలల పాటు ఇంటిల్లిపాది చూడొచ్చు. అందుకే థియేటర్లకు వచ్చే వాళ్ల సంఖ్య తగ్గిందని సర్వేలు కూడా చెప్తున్నాయి.

సినిమా టికెట్ల ధరలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు.. ప్రేక్షకులు వస్తారా?
X

బాలీవుడ్ రేంజ్‌ను కూడా దాటేసి హాలీవుడ్ స్థాయిని తెలుగు సినిమా టాలీవుడ్ చేరుకున్నది. ఎన్నో సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ అవుతున్నాయి. బాహుబలి నుంచి మొదలైన ఈ ట్రెండ్‌ను అల్లు అర్జున్ తన 'పుష్ఫ' సినిమాతో మరో రేంజ్‌కు తీసుకొని వెళ్లాడు. కోవిడ్ కారణంగా థియేటర్లు అన్నీ మూతబడిన సమయంలో సినీ ప్రేక్షకుడు ఓటీటీల వైపు మొగ్గు చూపాడు. పూర్తిగా ఓటీటీలు, ఆన్‌లైన్ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకుడిని థియేటర్ల వైపు రప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఇటీవల కేజీఎఫ్ 2, విక్రమ్ వంటి సినిమాలు మినహాయిస్తే.. మిగిలిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అన్నాయి. ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గిస్తే.. తెలుగు సినీ పెద్దలు సీఎం జగన్ వద్దకు వెళ్లి మరీ రేట్లు పెంచుకోవడానికి అనుమతి తెచ్చుకున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నది. కానీ ఆ తర్వాతే నిర్మాతలకు అసలు విషయం బోధపడింది. రేట్లు పెంచిన తర్వాత మంచి టాక్ వచ్చిన సినిమాలు కూడా కలెక్షన్లను రాబట్టలేకపోయాయి. ఎఫ్3, అంటే సుందరానికి, మేజర్ వంటి సినిమాలు పాజిటివ్ రివ్యూలనే పొందాయి. కానీ కలెక్షన్ల విషయంలో మాత్రం వెనుకబడ్డాయి.

అప్పటికీ మేజర్, అంటే సుందరానికి, విరాటపర్వం సినిమా నిర్మాతలు.. తాము తగ్గించిన టికెట్ రేట్లతో ప్రదర్శిస్తున్నామని చెప్పారు. అయినా ప్రేక్షకులు మాత్రం ఆ వైపు చూడలేదు. ఒక వ్యక్తి సినిమాకు వెళ్లాలంటే కనీసం సింగిల్ స్క్రీన్‌లో రూ. 200, మల్టీప్లెక్స్‌లో రూ. 300 ఖర్చు చేయాల్సి వస్తోంది. అదే సమయంలో రూ. 300 పెడితే ఏదో ఒక ఓటీటీని నెల, రెండు నెలల పాటు ఇంటిల్లిపాది చూడొచ్చు. అందుకే థియేటర్లకు వచ్చే వాళ్ల సంఖ్య తగ్గిందని సర్వేలు కూడా చెప్తున్నాయి.

ఇలాంటి సమయంలో దిల్ రాజు మరోసారి టికెట్ ధరలపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్ నగరాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రూ. 150+జీఎస్టీ, మల్టీప్లెక్స్‌లలో రూ. 200+జీఎస్టీని నిర్ణయించినట్లు చెప్పారు. స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాలకు తప్ప మిగతా వాటికి కూడా ఇవే రేట్లు ఉంటాయని స్పష్టం చేశారు. అయితే ఈ ధరలకు సామాన్యుడు సినిమాకు వస్తాడా అని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. టికెట్ల ధరలు రూ. 100 నుంచి రూ. 200 లోపు ఉంటే ఆదరణ దక్కుతుందని, లేకపోతే రెగ్యులర్ ప్రేక్షకులు దూరం అవడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

First Published:  20 July 2022 11:45 AM GMT
Next Story