Telugu Global
Telangana

డిగ్గీరాజాకు అంత కెపాసిటి ఉందా?

సీనియర్ల మధ్య వివాదాలను పరిష్కరించేంత సీన్ డిగ్గీరాజాకు ఉందా అన్నదే అసలైన ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్ సంస్కృతిలోనే ఒకరు చెబితే మరొకరు వినటం అన్నది లేదు.

డిగ్గీరాజాకు అంత కెపాసిటి ఉందా?
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ముదిరిపోతున్న ఆధిపత్య పోరును పరిష్కరించేందుకు దిగ్విజయ్ సింగ్ అలియాస్ డిగ్గీరాజా హైదరాబాద్ చేరుకున్నారు. బుధవారం సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చీ రాగానే ఆయన ముందుగా భువనగిరి ఎంపీ, సీనియర్ నేత, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బద్ధ శ‌త్రువు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. తర్వాత మరికొందరితో కూడా సమావేశమయ్యారు. చాలామంది సీనియర్లలో అసలు సమస్య ఏమిటంటే రేవంత్‌ను పీసీసీ అధ్య‌క్షుడిగా అంగీకరించలేకపోతున్నారు.

సీనియర్లలో అత్యధికులకు పార్టీని నడిపించే సామర్ధ్యం లేదు. యువతను, జనాలను ఆకర్షించేంత సీన్ లేదు. సీనియారిటీ గురించి పదేపదే మాట్లాడుతారు కానీ పక్క నియోజకవర్గాల్లోని ఇద్దరు అభ్యర్ధులను కూడా గెలిపించలేరు. నిజంగా చెప్పాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నపుడు నీరసంగా ఉన్న పార్టీకి రేవంత్ పగ్గాలు అందుకున్న తర్వాతే ఉత్సాహం వచ్చింది. రేపటి ఎన్నికల్లో పార్టీని గెలిపించగలడా లేదా అన్న విషయాన్ని వదిలేస్తే పార్టీకి జవసత్వాలను నింపే ప్రయత్నం చేస్తున్నదైతే వాస్తవం.

దీన్నే చాలామంది సీనియర్లు తట్టుకోలేకపోతున్నారు. సరే వీళ్ళ గొడవలను పక్కనపెట్టేస్తే సీనియర్ల మధ్య వివాదాలను పరిష్కరించేంత సీన్ డిగ్గీరాజాకు ఉందా అన్నదే అసలైన ప్రశ్న. ఎందుకంటే కాంగ్రెస్ సంస్కృతిలోనే ఒకరు చెబితే మరొకరు వినటం అన్నది లేదు. ఒకళ్ళు చెబితే మిగిలినవాళ్ళు వినటం అంటే అది చెప్పే వాళ్ళ మీద వినేవాళ్ళకు భయమన్నా ఉండాలి లేదా భక్తన్నా ఉండాలి. చాలామంది సీనియర్లు నోరెత్తకుండా చెప్పింది చెప్పినట్లు విన్నది ఒక్క దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మాట మాత్రమే.

ఎందుకంటే వైఎస్ అంటే చాలామందిలో భయమూ ఉంది భక్తీ ఉంది. మరిప్పుడు అంతటి సామర్ధ్యం ఉన్న నేతలెవరున్నారు? పైగా సీనియర్లలో చాలామంది సోనియా, రాహుల్ గాంధి, ప్రియాంకగాంధిలతో డైరెక్ట్ యాక్సెస్ ఉన్నవారే. ఇదే సమయంలో సీనియర్లను కంట్రోల్లో ఉంచేత సీన్ డిగ్గీరాజాకు లేదని అందరికీ తెలుసు. ఏదో అధిష్టానం పంపింది కాబట్టి వచ్చారంతే. స్వయంగా సోనియా చెబితేనే సీనియర్లు వినేరకం కాదు. అలాంటిది డిగ్గీరాజా చెబితే వింటారా?

First Published:  22 Dec 2022 6:39 AM GMT
Next Story