Telugu Global
Telangana

సాగులో సాంకేతికత.. ప్రపంచానికి తెలంగాణ పాఠాలు

సాంకేతికత వినియోగించుకుంటూ రైతులకు మెళకువలు నేర్పడంతోపాటు అంతర్జాతీయ సంస్థల సహకారంతో వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయ వృద్ధి సాధిస్తోంది తెలంగాణ. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది.

సాగులో సాంకేతికత.. ప్రపంచానికి తెలంగాణ పాఠాలు
X

వ్యవసాయానికి ఆధునిక సాంకేతికత జోడించడం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం ద్వారా రైతులకు అండగా నిలిచింది తెలంగాణ ప్రభుత్వం. ఇది కేవలం తెలంగాణ పల్లెవాసులు చెబుతున్న మాట కాదు, ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF)) గుర్తించిన సత్యం. అవును తెలంగాణ కేవలం భారత్ కే కాదు, యావత్ ప్రపంచానికి కూడా సాగు-సాంకేతిక పాఠాలు చెబుతోంది. తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న సాగు సాంకేతికత ప్రపంచ దేశాలకు కూడా ఆదర్శనీయమని చెబుతోంది WEF.

సాగులో సాంకేతికత వినియోగించుకుంటే భారత దేశ వ్యవసాయ రంగం విలువ 2025 నాటికి కనీసం 4 లక్షల కోట్లు ఉంటుందని WEF అంచనా వేసింది. అయితే భారత దేశంలో అన్ని రాష్ట్రాలు వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నాయని చెప్పలేం. తెలంగాణ మాత్రం ఈ విషయంలో ముందుంది. దుక్కి దున్నే దశనుంచి పంటను మార్కెటింగ్ చేసుకునే వరకు ప్రభుత్వం రైతులకు అండగా నిలబడి సాంకేతికత ఆధారంగా సమస్యలు పరిష్కరిస్తోంది. అన్నదాతల ఆత్మహత్యలను సమర్థంగా నివారించింది.

ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న భారత్ లో వ్యవసాయ రంగం ప్రధాన భూమిక పోషిస్తోంది. దేశంలో 51శాతం పంట పండిస్తున్న రైతులు సన్నకారు, చిన్నకారు రైతులే కావడం విశేషం. మొత్తం రైతుల్లో వీరు 85శాతం మంది ఉన్నారు. ఇలాంటివారందరికీ తెలంగాణ ప్రభుత్వం సాంకేతికతతో సాయం చేస్తోంది. 2025నాటికి దాదాపు లక్షమంది రైతులకు అగ్రిటెక్ సేవలు, మౌలిక సదుపాయాలు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోంది. దేశంలో వెయ్యికంటే ఎక్కువ అగ్రిటెక్ స్టార్టప్ లు ఉండగా, అందులో తెలంగాణ వాటా అధికం.

ఇతర రంగాల్లో టెక్నాలజీని అందిపుచ్చుకున్నంత సులభంగా వ్యవసాయంలో దాన్ని అమలులోకి తేవడం సాధ్యం కాదు. చిన్న చిన్న కమతాలు, రైతుల్లో నిరక్షరాస్యత, పర్యావరణ సవాళ్లు... వంటివి ఈ రంగంలో ప్రతిబంధకాలు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సవాళ్లను అధిగమించి అగ్రిటెక్ సేవలు అందించడానికి బడ్జెట్ కేటాయింపులు పెంచింది. దానికి తగ్గట్టుగానే ఫలితాలు అందుకుంటోంది.

2014లో ఆవిర్భవించిన తెలంగాణ.. 2021-22 నాటికి వ్యవసాయ రంగంలో ఆశించిన అభివృద్ధి సాధించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 18.3 శాతానికి చేరుకుంది. అగ్రిటెక్ వ్యూహాల ద్వారానే ఈ ఘనత సాధ్యమైంది.

AI ద్వారా AI

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అగ్రికల్చర్ ఇన్నోవేషన్ అనే నినాదంతో ఫుడ్ ఇన్నోవేషన్ హబ్ లు ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF) భాగస్వామ్యంతో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ ద్వారా డిజిటల్ సాగు విధానాలకోసం కొత్త కార్యక్రమం రూపొందించారు. ఇందులో అగ్రి వేల్యూ చైన్ ట్రాన్స్ ఫర్మేషన్, అగ్రిటెక్ శాండ్ బాక్స్, అగ్రికల్చర్ డేటా ఎక్స్ చేంజ్, అగ్రికల్చర్ డేటా మేనేజ్మెంట్ ఫ్రేమ్ వర్క్.. కీలకం. వీటి ద్వారా వ్యవసాయంలో నూతన విధానాలు ప్రవేశపెట్టి, అంతిమంగా అటు వినియోగదారుడు, ఇతు రైతు లాభపడేలా సాగుకి సాంకేతికత జత చేశారు. మట్టినమూనాల సేకరణ నుంచి, గిడ్డంగులు, మార్కెటింగ్ వరకు ఈ సాంకేతికత రైతులకు ఉపయోగపడుతుంది.

మిర్చి రైతులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సలహాలు, భూసార పరీక్షలు, పంట నాణ్యత పరీక్షలు, ఇ-కామర్స్ వంటి వాటిలో సలహాలిచ్చేందుకు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మద్దతుతో డిజిటల్ గ్రీన్ కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. 2022లో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా, మిర్చి, వేరుశనగ రైతులు దీని ద్వారా లాభపడుతున్నారు. 2025నాటికి లక్షమంది రైతులకు సాయపడే లక్ష్యంతో దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.

సాంకేతికత వినియోగించుకుంటూ రైతులకు మెళకువలు నేర్పడంతోపాటు అంతర్జాతీయ సంస్థల సహకారంతో వ్యవసాయ ఉత్పత్తుల్లో గణనీయ వృద్ధి సాధిస్తోంది తెలంగాణ. ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది.

First Published:  16 Jun 2023 5:55 AM GMT
Next Story