Telugu Global
Telangana

లైబ్రరీల్లో డిజిటల్ ఎక్సలెన్సీ సెంటర్లు.. జూన్ నుంచే ప్రారంభం

జిల్లా గ్రంథాలయాల్లో దినపత్రికలు, పుస్తకాలు మాత్రమే ఉండేవి. ఇకపై స్కిల్ డెవలప్‌మెంట్ తర్ఫీదును కూడా ఇవ్వాలనే లక్ష్యంతో ఈ డిజిటల్ ఎక్సలెన్సీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.

లైబ్రరీల్లో డిజిటల్ ఎక్సలెన్సీ సెంటర్లు.. జూన్ నుంచే ప్రారంభం
X

పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థులు, యువతకు మరింతగా ఉపయోగపడేలా తెలంగాణలోని అన్ని జిల్లా గ్రంథాలయాల్లో ఇకపై డిజిటల్ ఎక్సలెన్సీ సెంటర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో ఇప్పటికే మూడు గ్రంథాలయాల్లో డిజిటల్ ఎక్సలెన్సీ సెంట్లను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ డిజిటల్ ఎక్సలెన్సీ సెంటర్లకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇప్పటి వరకు జిల్లా గ్రంథాలయాల్లో దినపత్రికలు, పుస్తకాలు మాత్రమే ఉండేవి. ఇకపై స్కిల్ డెవలప్‌మెంట్ తర్ఫీదును కూడా ఇవ్వాలనే లక్ష్యంతో ఈ డిజిటల్ ఎక్సలెన్సీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్ జిల్లా గ్రంథాలయాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ప్రారంభించిన ఈ సెంటర్లకు అపూర్వ స్పందన లభించింది. పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్న వారికి ఈ డిజిటల్ ఎక్సలెన్సీ సెంటర్లు చాలా ఉపయోగపడుతున్నాయి.

తాజాగా రాష్ట్రంలోని మరో 20 గ్రంథాలయాల్లో డిజిటల్ ఎక్సలెన్సీ సెంటర్లను ప్రారంభించనున్నారు. జూన్‌లో రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్, సిద్ధిపేట, దేవరకొండ, బెల్లంపల్లి శాఖ గ్రంథాలయాల్లో డిజిటల్ ఎక్సలెన్సీ సెంటర్లు ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ అయాచితం శ్రీధర్ తెలిపారు. ఆ తర్వాత 33 జిల్లాల్లో డిజిటల్ ఎక్సలెన్సీ సెంటర్లు ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.

డిజిటల్ ఎంపర్‌మెంట్ ఫౌండేషన్‌తో ఇప్పటికే మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో టాస్క్, డైరెక్టర్ ప్రజా గ్రంథాలయాలు, వీ-హబ్ వంటి సంస్థలు భాగస్వామ్యమయ్యాయి. కేవలం పోటీ పరీక్షలకు సిద్ధపడే వారికే కాకుండా ఇతర రంగాల్లో రాణించాలనుకునే మహిళలు, యువతకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఇక్కడే ఓటర్ ఐడీ, ఆధార్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటికి దరఖాస్తు చేసుకోవడానికి సౌలభ్యం ఉంటుంది.

డిజిటల్ ఎక్సలెన్సీ సెంటర్లలో 8 నుంచి 18 ఏళ్ల విద్యార్థుల కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ స్టెమ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. కోడింగ్ బేసిక్స్ నేర్పిస్తారు. ప్రతీ గ్రంథాలయంలో ఉండే టూల్ కిట్ల ద్వారా పలు అంశాలపై తర్ఫీదు ఇస్తారు. టాస్క్ ద్వారా ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, యాప్‌ల వినియోగం. డిజిటల్ మార్కెటింగ్‌లో శిక్షణ ఇస్తారు. వీ-హబ్ ద్వారా మహిళలకు స్టార్టప్‌ల ద్వారా రాణించడం, డిజిటల్ అక్షరాస్యత, టెక్నికల్ స్కిల్స్‌పై శిక్షణ ఇస్తారు.

First Published:  29 May 2023 1:27 AM GMT
Next Story