Telugu Global
Telangana

టిపిసిసి లో విభేదాలు.. నాయ‌క‌త్వంపై ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఆగ్ర‌హం

కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ నాయకత్వంపై మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు టిఆర్ ఎస్‌, బిజెపిలు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుంటే.. ఎటువంటి వ్యూహాలు లేకుండా పార్టీని బ‌లోపేతం దిశ‌గా ఎలా న‌డిపిస్తార‌ని ఆయన ప్ర‌శ్నించారు.

టిపిసిసి లో  విభేదాలు.. నాయ‌క‌త్వంపై ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి ఆగ్ర‌హం
X

సంగారెడ్డి ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి పార్టీ నాయ‌క‌త్వ తీరుపై మ‌ళ్ళీ ఆగ్ర‌హించారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లోని విభేదాలు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చాయి. పార్టీని న‌డిపే తీరు ఇదేనా అంటూ ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేశార‌ని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప‌రిస్థితి, భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించేందుకు టిపిసిసి నాయ‌క‌త్వం శ‌నివారంనాడు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసింది. పార్టీ నాయ‌కుల‌తో ఈ జూమ్ ద్వారా చ‌ర్చించాల‌ని నిర్ణ‌యించింది. ఈ స‌మాచారాన్ని నాయ‌కుల‌కు తెలియ‌జేసేందుకు ఫోన్ చేసిన నేత‌తో జ‌గ్గారెడ్డి త‌న అభిప్రాయాల‌ను కుండ‌బ‌ద్ద‌లుకొట్టిన‌ట్టు చెప్పార‌ని తెలిసింది.

ప్ర‌స్తుతం పార్టీ ఉన్న ప‌రిస్థితుల్లో నాయ‌కులు ప్ర‌త్య‌క్షంగా కూర్చుని చ‌ర్చించుకుంటే అభిప్రాయాలు నేరుగా చెప్పేందుకు చ‌ర్చ జ‌రిగేందుకు వీలుంటుంది కానీ ఇలా జూమ్ మీటింగ్ ల‌తో కాల‌క్షేపం చేయ‌డం ఏంట‌ని జ‌గ్గారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారుట‌. పార్టీ న‌డిపే విధానం ఇదేనా అని ఆయ‌న మండి ప‌డ్డార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్ర‌ రాజ‌కీయాల్లో నెల‌కొన్న ప‌రిణామాల‌పై కూలంక‌షంగా చ‌ర్చించుకోవాల్సిన స‌మ‌యంలో నామ‌మాత్ర‌పు మీటింగ్‌ల‌తో ప్ర‌యోజ‌నం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఓ వైపు టిఆర్ ఎస్‌, బిజెపిలు దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుంటే ప‌ట్టించుకోకుండా ఎటువంటి వ్యూహాలు లేకుండా పార్టీని బ‌లోపేతం దిశ‌గా ఎలా న‌డిపిస్తార‌ని ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది. ఇదే సంద‌ర్భంలో ఆయ‌న మాట్లాడుతూ రాహుల్ గాంధీ పాద‌యాత్ర‌, రాష్ట్రంలోని పార్టీ ప‌రిస్థితుల‌పై స‌మీక్ష చేయాలి క‌దా ఆ మాత్రం స‌మ‌యం నాయ‌కుల‌కు లేదా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారంటున్నారు.

శనివారం రోజున జూమ్ మీటింగ్ ద్వారా నేతలందరితో చర్చించి త్వరలో కాంగ్రెస్ కార్యాచరణను ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి నిన్న తెలిపారు. ముందుగా రైతుల సమస్యలపై పోరాటం చేస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో బడుగు బలహీన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు.

First Published:  19 Nov 2022 8:43 AM GMT
Next Story