Telugu Global
Telangana

మేడ్చెల్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు.. టికెట్ల పంచాయితీ షురూ

తెలంగాణ ఏర్పడిన తర్వాత మాత్రం బీఆర్ఎస్‌దే రెండు సార్లు పై చేయిగా ఉన్నది. ఈ సారి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా మేడ్చెల్ సీటును తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నది.

మేడ్చెల్ కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు.. టికెట్ల పంచాయితీ షురూ
X

హైదరాబాద్ శివారులో ఉన్న కీలక నియోజకవర్గం మేడ్చెల్. ఈ నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉన్నది. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశంలో కీలక నాయకుడు దేవేందర్ గౌడ్ వరుసగా మూడు సార్లు గెలిచారు. ఇక మల్లారెడ్డి తొలి సారి అసెంబ్లీకి అగుడుపెట్టింది ఈ నియోజకవర్గం నుంచే కావడం గమనార్హం. ఆయన ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా.. ఏకంగా మంత్రి అయ్యారు. 2014, 2018లో వరుసగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వచ్చారు. అంతకు ముందు 2009లో కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు.

మేడ్చెల్ నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నది. ఆ తర్వాత తెలుగు దేశం ఈ నియోజకవర్గంలో పాతుకొని పోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మాత్రం బీఆర్ఎస్‌దే రెండు సార్లు పై చేయి అయ్యింది. ఈ సారి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా మేడ్చెల్ సీటును తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తున్నది. మంత్రి మల్లారెడ్డి మీద ఇటీవల క్షేత్ర స్థాయిలో కాస్త వ్యతిరేకత పెరగడంతో.. ఆ అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నది. ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు ఉన్నది. అందుకే సరైన అభ్యర్థిని నిలపడం ద్వారా కాంగ్రెస్ ఈ సీటును కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో ఉంది.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల సమయమే ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వారు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. కర్ణాటక ఎన్నికల విజయం తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. ఈ సారి అధికారంలోకి రావడం ఖాయమని అందరూ అంచనా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంత మంది ముఖ్య నేతలు మేడ్చెల్ సీటు తమ వర్గానికే కేటాయించాలంటూ ఇప్పటి నుంచే హైకమాండ్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా, 2009లో మేడ్చెల్ నుంచి గెలుపొందిన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.. 2014లో ఓడిపోయినా.. ఆయన కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగుతున్నారు. గతంలో ఆయన పార్టీ మారుతారని వార్తలు వచ్చినా.. లక్ష్మారెడ్డి మాత్రం కాంగ్రెస్‌ను వీడలేదు. తాజాగా ఆయనకు ఉమ్మడి రంగారెడ్డి ఎన్నికల బాధ్యతలను కూడా కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టింది. ఈ క్రమంలో ఆయనకే మేడ్చెల్ టికెట్ మరోసారి దక్కుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే లక్ష్మారెడ్డికి పోటీగా జంగయ్య యాదవ్, హరివర్ధన్ రెడ్డి టికెట్ కోసం పోటీ పడుతున్నారు. లక్ష్మారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సమయంలో తామే పార్టీని నడిపించామని చెబుతున్నారు. ఎంతో కాలంగా పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నామని.. ఎన్నికల సమయంలో ముందుకు వచ్చిన వ్యక్తికి పార్టీ టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. వరుసగా రెండు ఎన్నికల్లో లక్ష్మారెడ్డి ఓడిపోయిన విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కూడా మేడ్చెల్ బరిలో దిగుతున్నారు. మేడ్చెల్ కాంగ్రెస్ టికెట్ నాదే అని ఆయన ప్రచారం చేసుకోవడం స్థానిక కాంగ్రెస్ నాయకులకు మింగుడు పడటం లేదు. సోషల్ మీడియతో పాటు తనకు ఉన్న యూట్యూబ్ ఛానల్ ద్వారా టికెట్ తనకు కన్ఫార్మ్ అయినట్లు ప్రచారం చేసుకుంటుండంపై పలువురు కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. కాగా, నల్గొండ జిల్లాకు చెందిన ఒక కీలక నాయకుడు.. మల్లన్న వెనుక ఉన్నట్లు ప్రచారం జరగుతుతోంది.

కాగా, ఇప్పుడే ఎవరికి వారు టికెట్ తమకే వస్తుందని ప్రచారం చేసుకోవడంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మండిపడుతోంది. ఎన్నికల సమయంలో అందరూ కలిసికట్టుగా పని చేయాలని.. ఈ సమయంలో టికెట్ల లొల్లి సరికాదని సూచిస్తోంది. టికెట్లను ఎవరెవరికి ఖరారు చేయాలనే విషయంపై సీనియర్లతో చర్చించి.. హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. ఎవరికి టికెట్ ఇచ్చినా.. అందరూ కలిసి కట్టుగా పని చేసి గెలిపించాల్సిన బాధ్యత ఉందని చెబుతున్నారు. అయినా సరే కొంత మంది నాయకులు మాత్రం టికెట్ విషయంలో పట్టు వీడటం లేదు. తమకే టికెట్ అని మేడ్చెల్‌లో ప్రచారం చేసుకుంటూ.. కార్యకర్తల్లో గందరగోళం సృష్టిస్తున్నారు.

First Published:  23 July 2023 7:19 AM GMT
Next Story